Begin typing your search above and press return to search.

సినిమాల్లో స‌క్సెస్.. ఎన్నిక‌ల్లో ఫెయిల్ అయ్యారు!

By:  Tupaki Desk   |   24 May 2019 6:49 AM GMT
సినిమాల్లో స‌క్సెస్.. ఎన్నిక‌ల్లో ఫెయిల్ అయ్యారు!
X
ఏపీలో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ క‌కావిక‌ల‌మైంది. ఫ్యాన్ గాలి వృద్ధికి సైకిల్ క‌ద‌ల‌టం క‌ష్ట‌మైన ప‌రిస్థితి. టీడీపీ ఏర్పాటు త‌ర్వాత ఎన్నో ఎన్నిక‌ల్ని చూసినా.. ఇంత‌టి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తీసుకొచ్చిన ఎన్నిక‌ల్ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాలేదు.

మొత్తం 175 స్థానాలున్న ఏపీలో కేవ‌లం 23 స్థానాల్లోనే విజ‌యం సాధించిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే లోక్ స‌భ స్థానాల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉంది. కౌంటింగ్ ఫలితాలు వెలువ‌డుతున్న మొద‌ట్లో దాదాపు కొన్ని గంట‌ల పాటు.. ఏ ఒక్క స్థానంలోనూ అధిక్య‌త‌లో లేని ప‌రిస్థితి. దీంతో.. ఏపీలోని పాతిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధిక్య‌త‌లో ఉన్నట్లుగా క‌నిపించింది. దీంతో..టీడీపీకి గుండు సున్నా త‌ప్ప‌దా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.చివ‌ర‌కు దారుణ ప‌రాభ‌వానికి బ‌దులుగా మూడు ఎంపీ స్థానాల్లో గెలిచి.. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన ప‌రిస్థితి టీడీపీకి ఎదురైంది.

ఏపీలో ఫ్యాన్ గాలి దెబ్బ‌కు టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయినప్ప‌టికీ.. కొన్నిస్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు అవ‌కాశాలు మిస్ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అలాంటి అవ‌కాశం ఉన్న స్థానంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానంగా చెప్పొచ్చు. విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌ముఖ సినీ నిర్మాత పొట్లూరు వ‌ర‌ప్ర‌సాద్ బ‌రిలో నిలిచారు. ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు తీసి.. స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా పేరున్న ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీ కావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపించింది.

ఇటీవ‌ల ఆయ‌న నిర్మించిన మ‌హ‌ర్షి మూవీ స‌క్సెస్ కావ‌టం తెలిసిందే. ఈ సంతోషంలో ఉన్న ఆయ‌న‌కు.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితం ఇబ్బందిక‌రంగా మారింది. విజ‌య‌వాడ సిట్టింగ్ ఎంపీ.. టీడీపీ నేత క‌మ్ పారిశ్రామిక‌వేత్త అయిన కేశినేని నాని చేతిలో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. పొట్లూరిపై నాని 8238 ఓట్ల‌తేడాతో విజ‌యం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ఇంత ఉధృతంగా వీసిన వేళ ఓట‌మిపాలు కావ‌టం పొట్లూరికి ఇబ్బందిక‌రంగా మారింది. ఎన్నో స‌క్సెస్ సినిమాలు తీసిన నిర్మాత‌.. ఎన్నిక‌ల్లో మాత్రం ఓట‌మిపాలు కావ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. పీవీపీ పొలిటిక‌ల్ స‌క్సెస్ మంత్ర మీద మ‌రింత దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.