Begin typing your search above and press return to search.

పవన్ ను నమ్మి చెడి.. పక్కదారి చూస్కున్నాడు

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:36 AM GMT
పవన్ ను నమ్మి చెడి.. పక్కదారి చూస్కున్నాడు
X
పీవీపీ గురించి తెలియనివారుండరు. భారీ చిత్రాల అగ్ర నిర్మాతగా టాలీవుడ్ మొత్తానికి చిరపరిచితులైన పీవీపీ.. క్రమంగా సినిమా నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పీవీపీ చాలా సీరియస్ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించాలని కూడా గట్టి ప్రయత్నం చేసి విఫలైన వ్యక్తి అని కొంతమందికి తెలుసు. వారు కూడా బహుశా మరచిపోయి ఉండొచ్చు. అంతగా ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. అచ్చంగా సినిమారంగంలోనే ఉండిపోయారు. తీరా ఇప్పుడు సినిమా రంగంలో దెబ్బ మీద దెబ్బ తిని పూర్తిగా కుదేలైన ఆయన ఈ రంగాన్ని వదిలేసి ఇక పూర్తిగా రాజకీయాలు మాత్రమే చేయాలనుకుని అటు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రసాద్ వి.పొట్లూరి- పవన్ ను నమ్మి చెడిన వ్యక్తుల్లో ఒకరిగా కొన్ని పుకార్లున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాద్ వి.పొట్లూరి విజయవాడ పార్లమెంటు సీటునుంచి పోటీ చేయాలనుకున్నారు. తెలుగుదేశం టిక్కెట్ కోసం ఆయన పవన్ ను ఆశ్రయించారు. అప్పట్లో తాను తెలుగుదేశానికి అనుకూల ప్రచారం చేస్తున్నాడు గనుక.. తన మాటకు విలువ ఇచ్చి ఆ మాత్రం ఒక ఎంపీ టికెట్ ఇవ్వకపోతారా అని పవన్ కూడా ప్రయత్నించారు గానీ.. విజయవాడ ఎంపీ సీటుకు అప్పటికే బీభత్సమైన పోటీ ఉన్న తెలుగుదేశంలో పవన్ పైరవీ పనిచేయలేదని ప్రచారం ఉంది. దీంతో పీవీపీ అనివార్యంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత కనీసం సినిమాల్లో అయినా పవన్ ద్వారా లాభపడాలని ఆయన అనుకున్నారు. గబ్బర్ సింగ్ 2 తర్వాత పీవీపీ బ్యానర్లో పవన్ చేసే సినిమా మొదలవుతుందని అంతా అనుకున్నారు. అప్పటికే బ్రహ్మోత్సవం దెబ్బకు కోలుకోలేని స్థితిలో పడ్డ పీవీపీ కనీసం పవన్ ద్వారా లాభాలు కళ్లజూడాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఎంత కాలానికీ పట్టాలెక్కలేదు. పవన్ ను నమ్మి ఆయన మళ్లీ భంగపడ్డాడు.

2014కు పూర్వం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి సంబంధించి.. ప్రసాద్ వి.పొట్లూరి అన్ని రకాలుగానూ అండదండలు అందించారనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం సినిమాలు ఇక అక్కర్లేదని డిసైడయ్యాక ఆయన ఏపీలో రాజకీయాల్లోకి క్రియాశీలంగా ఎంట్రీ ఇస్తున్నారట. ఈసారి పవన్ జనసేన జోలికి వెళ్లడం లేదని.. ఏపీలోని రెండు పెద్ద పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.