Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య‌పై ఆసుప‌త్రిలో ఉన్న ప‌ర‌మేశ్వ‌ర్ ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   19 March 2019 5:43 AM GMT
వివేకా హ‌త్య‌పై ఆసుప‌త్రిలో ఉన్న ప‌ర‌మేశ్వ‌ర్ ఏం చెప్పారంటే?
X
వైఎస్ వివేకానంద దారుణ హ‌త్య‌లో పాత్ర ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న ప‌ర‌మేశ్వ‌ర్ ఆచూకీ ల‌భించింది. వివేకా హ‌త్య జ‌రిగిన తెల్లారి నుంచే ఆయ‌న కుటుంబం మొత్తం అదృశ్య‌మైన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు వైఎస్ వివేకాకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ఆయ‌న‌.. కొద్ది కాలంగా వివేకాతో పెద్ద‌గా సంబంధాలు లేవ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. వివేకా హ‌త్య జ‌రిగిన ముందు రోజు అర్థ‌రాత్రి వ‌ర‌కూ ప‌ర‌మేశ్వ‌ర్ ఇంట్లో లైటు వెలుగుతూనే ఉంద‌ని.. తెల్ల‌వారేస‌రికి ఇంట్లో వాళ్లంతా క‌నిపించ‌లేద‌న్న మాట వినిపించింది.

దీంతో ప‌ర‌మేశ్వ‌ర్ ఎవ‌రు? అత‌ని బ్యాక్ గ్రౌండ్ ఏమిట‌న్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు. అత‌ని ఆచూకీ కోసం వెతుకుతున్న వేళ‌.. తిరుప‌తిలోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకుంటున్న వైనం వెలుగు చూసింది. ప‌ర‌మేశ్వ‌ర్ భార్య పోలీసుల‌కు ఫోన్ చేసి తాము ఆసుప‌త్రిలో ఉన్న‌ట్లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప‌ర‌మేశ్వ‌ర్ ను మీడియా ప్ర‌తినిధులు ప‌లుక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వివేకాను హ‌త్య చేసింది ఇంటి దొంగ‌లే అన్న అనుమానం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. వివేకాను తాను త‌ర‌చూ క‌లుస్తుంటాన‌ని చెప్పారు. హ‌త్య‌కు మూడు రోజుల ముందు లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ ను క‌లిశార‌ని.. ఆ త‌ర్వాత ఎంతో హుషారుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ప‌ర‌మేశ్వ‌ర్ ఏం చెప్పారన్న‌ది చూస్తే..

+ వివేకా సారు ఎన్నో విషయాలు.. రాజకీయాలు నాతో మాట్లాడేవారు.. ఈసారి ఎన్నికల్లో విజయమ్మ - షర్మిలక్కను పోటీ చేయాల‌ని కోరారు. హత్యకు మూడురోజుల ముందు లోటస్ పాండ్‌ లో జగన్‌ ను కలిశారు. అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌నెంతో హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వచ్చి దారుణహత్యకు గురయ్యారు.

+ ఇంటి వాళ్ల హస్తం లేనిదే వివేకా హత్య జరగదు. ఇది ఇంటి దొంగల పనే.

+ షర్మిలక్కను ఎంపీగా పోటీ చేయమని వివేకా మొదట అడిగారు. షర్మిలా లేదా విజయమ్మను పోటీ చేయాలని ఆయన కోరారు. జగన్‌ రెడ్డితో చర్చించి మీ ఫ్యామిలీలో మీరే నిర్ణయం తీసుకోవాలని నేను చెప్పా.

+ వివేకాను ఎంపీగా పోటీ చేయమని కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చారు.అవినాష్ రెడ్డి పోటీ చేస్తే మెజార్టీ తగ్గుతుందని వివేకా అభిప్రాయపడేవారు. తాను ఎంపీగా పోటీ చేయలేనని కుటుంబ సభ్యులకు చెప్పిన‌ట్లు వివేకా నాతో చెప్పారు.

+ ఓ రోజు విజయమ్మ - షర్మిలా ఎదుటే వివేకా పోటీ చేయలేనని చెప్పినప్పుడు మా మండల నాయకులు కూడా ఉన్నారు.

+ ఓ రోజు వివేకా డల్‌ గా కనిపించడంతో ఏం తోటకాడికి పోయారా..? ఎందుకు అలా ఉన్నారని అడిగా. ఇది జ‌రిగిన మూడు రోజుల తరువాత జగన్ ను కలిసి వచ్చిన వివేకా ఎంతో హ్యాపీగా కనిపించారు.

+ జగన్‌ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. వివేకా ఎదుగుదల చూడలేకే ఈ హత్య చేసి ఉంటారు.

+ ఆరు నెలలకొకసారి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పులివెందులకు వచ్చేది - ఎప్పుడూ వివేకా ఒంటరిగానే ఉండేవాడు. ఒంటరిగా ఉన్నా లైసెన్సు గన్‌ ఆయన వద్ద ఉంటుంది. హంతకులు తలుపు పగలగొట్టుకుని చప్పుడు చేస్తే వివేకా వెంటనే మాకు ఫోన్‌ చేసేవారు. తెలివిగా లోపలికి వెళ్లి ఇంటి దొంగలే ఓ పథకం ప్రకారం హత్య చేశారు. కొన ఊపిరితో ఉండగానే లేఖ రాయించి ఉంటారు.

+ ఆయన ఎప్పుడూ ఎవరినీ నమ్మదలుచుకోలేదు. ఇంట్లో వాళ్లనే నమ్మేవాడు. ప్రసాద్‌ డ్రైవరు మంచివాడు. వైఎస్‌ కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం మాది. చంపేంత పరిస్థితి నాకు లేదు.