Begin typing your search above and press return to search.

తెలంగాణలో రంగంలోకి కేంద్ర బలగాలు

By:  Tupaki Desk   |   28 March 2020 6:30 AM GMT
తెలంగాణలో రంగంలోకి కేంద్ర బలగాలు
X
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్‌ ను కట్టుదిట్టంగా.. పటిష్టంగా అమలుచేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. తెలంగాణలో విజయవంతంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్నా మరింత పటిష్టంగా అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం పారామిలటరీ - ఇతర బలగాలను పంపిస్తోంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక బలగాలను తరలిస్తోంది. లాక్‌ డౌన్‌ అమలు సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులపై స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అక్కడక్కడ ప్రజలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతుండడంతో వారిని కట్టడి చేసేందుకు, లాక్‌ డౌన్‌ ను మరింత పటిష్టంగా అమలుచేసేందుకు కేంద్ర బలగాలతో చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా తెలంగాణకు 80 వాహనాల్లో కేంద్ర బలగాలు వచ్చాయని సమాచారం.

కర్నాటకలోని బీదర్‌ నుంచి పారామిలటరీతో పాటు ఇతర బలగాలు శుక్రవారం హైదరాబాద్‌ కు పంపించారు. దాదాపు 80 వాహనాల్లో ఈ ప్రత్యేక బలగాలు జహీరాబాద్ - సదాశివపేట - సంగారెడ్డి - పటాన్‌ చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా హైదరాబాద్‌ కు ఆ బలగాలు చేరుకున్నాయి. ఇక హైదరాబాద్‌ లో లాక్‌ డౌన్‌ ను పటిష్టంగా అమలు చేసేందుకు ఈ బలగాలు చర్యలు తీసుకోనున్నాయి. అయితే రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విజయవంతంగా అమలవుతోందని - కేంద్ర బలగాలు అవసరం ఏమి లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. లాక్‌ డౌన్‌ కోసం కాకుండా సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చి ఉంటాయని వెల్లడించారు. అయితే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయనే సమాచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.