Begin typing your search above and press return to search.

దుష్ప్ర‌చారం అన్నాడు కానీ పార్టీ వీడేది చెప్ప‌ని ప‌ర్చూరు టీడీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   31 May 2020 7:22 AM GMT
దుష్ప్ర‌చారం అన్నాడు కానీ పార్టీ వీడేది చెప్ప‌ని ప‌ర్చూరు టీడీపీ ఎమ్మెల్యే!
X
అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ లో చేరే విష‌యమై ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు. తాజాగా ఆయ‌న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెసేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తాడ‌ని కొన్నిరోజులుగా వార్తలు - పుకార్లు వస్తూనే ఉన్నాయి. పార్టీలో చేరిక‌పై ఇటీవల‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమ‌య్యార‌ని - త్వ‌ర‌లోనే కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆదివారం టీడీపీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ఆయ‌న సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారితో స‌మ‌గ్రంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీని వీడటంపై స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టు ఇవ్వ‌లేదు. టీడీపీని వీడతానంటూ వ‌స్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. కానీ చేర‌తారా లేదా అనేది తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో కొందరు కావాలనే పని కట్టుకుని అత‌డిపై దుష్ప్రచారం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న‌కు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదని తెలిపారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరపలేదని, త‌న‌కు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేన‌ని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబసభ్యుడిగా చూస్తున్నార‌ని వివ‌రించారు. టీడీపీ హయాంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేశానని వెల్ల‌డించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పనులు వారు చేసుకుంటారనే ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌ నిబద్ధతను ప్రశ్నించేలా వ‌స్తున్న వార్తలు త‌న‌ను బాధించాయని పేర్కొన్నారు. త‌న‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వచ్చిన వార్తలు ఖండిస్తున్నానని చెప్పారు. ఈ విధంగా ఆయ‌న స‌మావేశంలో చెప్పినా మ‌న‌స్ఫూర్తిగా చెప్పిన‌ట్టు ఆయ‌న ముఖ‌క‌వ‌ళిక‌ల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు కాక‌పోయినా కొన్నాళ్లు ఆగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.