Begin typing your search above and press return to search.

వామ్మో ఆన్ లైన్ చదువా.? మోత మోగిపోద్దీ

By:  Tupaki Desk   |   6 Jun 2020 12:30 AM GMT
వామ్మో ఆన్ లైన్ చదువా.? మోత మోగిపోద్దీ
X
మహమ్మారి వైరస్ వ్యాపించడంతో ఈ లాక్ డౌన్ వేళ స్కూల్లు తెరిచే పరిస్థితి లేదు. దీంతో విద్యాసంస్థలన్నీ ఆన్ లైన్ చదువులను కొనసాగిస్తున్నాయి. ప్రతీ విద్యార్థికి ఒక ల్యాప్ టాప్ లేదా ట్యాబ్ కంపల్సరీగా తీసుకోమంటున్నాయి. దానికి అదనంగా ఆన్ లైన్ క్లాసులు కావాలంటే వైఫై నెట్ కనెక్షన్ కావాలి. సో ఇలా వీటికోసమే 30, 40వేలు ఖర్చు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలు చదువును ‘కొనాల్సిన’ పరిస్థితి దాపురించడంతో ఈ కరోనా టైంలో లబోదిబోమంటున్నారు.

పిల్లల చదువుల కోసం ఎంతైనా ఖర్చు చేసే తల్లిదండ్రులను విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. విద్యార్థులకు ఆన్ లైన్ చదువుల పేరిట క్లాస్ చెప్పేందుకు విద్యాసంస్థలన్నీ సిద్ధం కావడంతో ఆ ఖర్చును భరించడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టకాలంలో తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ ఆన్ లైన్ చదువులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులును పెను భారంగా మారుతున్నాయి. చదువులకు ఫీజులే కాదు.. ప్రతీ విద్యార్థికి ఆన్ లైన్ చదువు కోసం లాప్ టాప్, ట్యాబ్ లు, వైఫై కనెక్షన్లకు అధికంగా ఖర్చు చేసుకుంటూ ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు.

ఆన్ లైన్ చదువుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ఏడాది అదనంగా రూ.5500 కోట్ల భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ఆన్ లైన్ చదువులు మొదలు కావడంతో వారం రోజులుగా ల్యాప్ టాప్ ల కోసం తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో షాపుల వద్దకు వస్తున్నారని కంప్యూటర్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లల కోసం రూ.20వేల నుంచి రూ.35వేల దాకా చెల్లించి మరీ ల్యాప్ ట్యాప్ లు కొంటున్నారని తెలిపారు. దీంతో ఈ చదువులతో కుటుంబాలపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. కరోనా కష్టకాలంలో ఇది తలకు మించిన భారం అవుతోంది.