Begin typing your search above and press return to search.

మొత్తానికి ఆ రాక్షసుడ్ని సజీవంగా పట్టేశారు

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:25 AM GMT
మొత్తానికి ఆ రాక్షసుడ్ని సజీవంగా పట్టేశారు
X
ప్యారిస్ లో నరమేధం సృష్టించి.. 129 మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన రాక్షసుడ్ని పోలీసులు పట్టేశారు. ప్యారిస్ ఉగ్రఘటనకు తన సహాయ సహకారాలు అందించిన నరహంతకుడైన అబ్దెస్లామ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ప్యారిస్ మారణహోమం జరిగిన నాటి నుంచి ఇతగాడి కోసం ఫ్రాన్స్ పోలీసులు జల్లెడ వేస్తున్నారు. అయితే.. పేలుళ్లు జరిగిన కాసేపటికే దర్జాగా.. ఫ్రాన్స్ సరిహద్దుల నుంచి తప్పించుకొని పారిపోయిన విషయాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. ప్యారిస్ లో పెద్ద ఎత్తున ప్రాణాలు తీసిన నరహంతకుడు దొరికినట్లే దొరికి చేజారిపోవటం పోలీసులకు తీవ్ర అసంతృప్తి గురి చేసింది. అయితే.. అతగాడి కోసం అటు ఫ్రాన్స్ పోలీసులతో పాటు.. బెల్జియం పోలీసులు సైతం వేటాడారు. ప్యారిస్ కాల్పుల ఘటన అనంతరం ఫ్రాన్స్ నుంచి బెల్జియం పారిపోయిన అతడి ఆచూకీ గుర్తించటానికి విపరీతంగా శ్రమించారు.

ఎట్టకేలకు భద్రతా బలగాల కష్టం ఫలించి.. అబ్దెస్లామ్ ను సజీవంగా బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి పారిపోయి బెల్జియంకు చేరిన అతగాడి ఇంటిని గుర్తించి.. అనంతరం బెల్జియం పోలీసుల సాయంతో బ్రస్సెల్స్ లోని ఇంటిని చుట్టుముట్టేశారు. ఈ నరరూప రాక్షసుడ్ని సజీవంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ దాడి నేపథ్యంలో దీని వెనుక ఎవరున్నారు? ఆయుధాలు.. నిధులు ఎవరు సరఫరా చేశారు? దాడులు ఎందుకు పాల్పడ్డారన్న అంశాలపై విచారణను ముమ్మరం చేశారు. ఈ 26 ఏళ్ల నరహంతకుడి వెనుక ఉన్న అసలు గుట్టును రట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.