Begin typing your search above and press return to search.

మన తెలుగు సినిమాలో మాదిరే ప్యారిస్ లోనూ?

By:  Tupaki Desk   |   15 Nov 2015 4:33 AM GMT
మన తెలుగు సినిమాలో మాదిరే ప్యారిస్ లోనూ?
X
అనుకోని విపత్తు ఏర్పడితే భారతీయులు ఒక్కసారిగా సంఘటితమవుతారు. ఉగ్రవాదుల దాడి జరిపినప్పుడు.. సంబంధం లేని వ్యక్తి సైతం భాగస్వామి అవుతాడు. బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల సమయంలో కానీ.. లుంబిని పార్క్.. గోకుల్ ఛాట్ బాంబు దాడి సమయంలోనూ.. భయపడే ప్రజలు ఎందరు ఉంటారో.. బాధితుల్ని రక్షించేందుకు అంతేమంది తపిస్తారు. తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టటానికి వెనకాడరు. రక్తమోడుతున్న శరీరాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏ మాత్రం సంశయించరు. మొత్తంగా.. బాధితుల పట్ల ఎలాంటి భయం.. సంకోచం లాంటివి లేకుండా అపన్నహస్తం అందించేందుకు ముందుకు వస్తారు.

ఇదిలా ఉంటే.. మన సినిమాల్లో రౌడీలు ఏదైనా దాడి చేస్తుంటే.. భయపడిపోయి ఇంటి తలుపుల్ని వేసుకొని.. సాయం కోసం భాదితులు అరుస్తున్నా.. ప్రాధేయపడుతున్నా పెద్దగా పట్టించుకోని సీన్లు తరచూ కనిపిస్తాయి. లోకల్ రౌడీల విషయంలో ఇలాంటి పరిస్థితి చిన్న చిన్న ఊళ్లల్లో ఉంటాయేమో కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి దుస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేదనే చెప్పాలి.

ఉగ్రదాడి జరిగిన సమయంలో సాయం కోసం ఓ చిన్నారి ప్రతి ఇంటి తలుపు తట్టినా.. అక్కడి వారు తలుపులు తెరవకపోవటం గమనార్హం. ఉగ్రవాదులు జరిపిన దాడికి ఫ్యారిస్ నగరవాసులు ఎంతలా భయపడిపోయారన్న దానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెబుతున్నారు. తన నిస్సహాయతను తిట్టుకుంటూనే.. తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఒక బాలిక వీధిలో ఏడుస్తూ కనిపించిందని.. ఆమె ప్రతి ఇంటి తలుపునీ భయంతో తడుతూ.. ఎవరైనా తలుపులు తెరవాలంటూ అభ్యర్థించిందని.. కానీ ఎవరూ తెలుపులు తీయలేదని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ‘‘ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. తలుపులు తెరవండి ప్లీజ్ అంటూ బిగ్గరగా రోదిస్తూ అభ్యర్థిస్తోంది. ఆ క్షణంలో ఆమెను చూసి ఏం చేయ్యలేని నా నిస్సహాయతపై నాకే విసుగు కలిగింది. మరుక్షణం ఆమె నా కళ్ల ముందు నుంచి మాయమైంది’’ అని చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమాల్లో మాదిరి.. రౌడీలు.. గుండాలు ఎవరినైనా లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంటే.. ఎవరికి వారు తలుపులు బిడాయించుకొని కూర్చునే సీన్లు కోకొల్లలుగా కనిపిస్తాయి. తాజాగా ప్యారిస్ లాంటి మహానగరంలోని ప్రజలు అలాంటి భయాన్నే కలిగి ఉండటం గమనార్హం.