Begin typing your search above and press return to search.

టీడీపీ విజేతలు రాజీనామాలు చేస్తారా ?

By:  Tupaki Desk   |   20 Sep 2021 12:42 PM GMT
టీడీపీ విజేతలు రాజీనామాలు చేస్తారా ?
X
పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యమే లేకపోతే, ఎన్నికలను బహిష్కరించిందే నిజమైతే మరి గెలిచిన టీడీపీ అభ్యర్ధులు రాజీనామాలు చేస్తారా ? అని జనాల్లో చర్చలు మొదలయ్యాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి ఏకపక్షంగా వచ్చిన విషయం తెలిసిందే. 10047 ఎంపీటీసీ స్ధానాల్లో వైసీపీ 8200 స్ధానాల్లో గెలిచింది. అలాగే 660 జడ్పీటీసీ స్ధానాల్లో 616 చోట్ల గెలిచింది. ఎంపీటీసీ స్ధానాల్లో అయినా కాస్త పోటీ ఉందేమో కానీ జడ్పీటీసీ స్ధానాలకు జరిగిన ఎన్నికలు దాదాపు క్లీన్ స్వీప్ అనే చెప్పాలి.

ఏకపక్ష ఫలితాలనే టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే తాము ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని గుర్తుచేస్తోంది. తాము బహిష్కరించిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కూడా ఓ గెలుపేనా అంటు టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎగతాళిగా ప్రశ్నించటమే వాళ్ళ ఉడకుమోతుతనానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఎన్నికలు బహిష్కరించిందే నిజమైతే మరి పోటీలో టీడీపీ అభ్యర్ధులు ఎందుకున్నట్లు ? ఎందుకని అధికారపార్టీ అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం చేసుకున్నట్లు ?

ఎన్నికలను బహిష్కరించాలని అనుకున్నపుడు వేసిన నామినేషన్లలను అలాగే వదిలేయాలి. టీడీపీ అభ్యర్ధులు ఎక్కడా ప్రచారం చేసుకోకూడదు. ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించినా క్షేత్రస్ధాయిలో మాత్రం నేతలు గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. కాకపోతే అధికారపార్టీ నేతల ముందు తట్టుకోలేకపోయారు. దాని ప్రభావమే తాజా ఫలితాల్లో వెల్లడైంది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 7 జడ్పీటీసీలు, 923 ఎంపీటీసీల్లో గెలిచింది.

తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పుకుంటున్న అచ్చెన్నాయుడు మరి తమ విజేతలతో రాజీనామాలు చేయిస్తారా ? తమ పార్టీ తరపున గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో రాజీనామాలు చేయిస్తేనే హుందుగా ఉంటుంది. గెలిచిన వాళ్ళు రాజీనామాలు చేస్తేనే ఎన్నికలు బహిష్కరించామని చెప్పుకునేందుకు మద్దతుగా ఉంటుంది. అచ్చెన్న తమ విజేతలతో ఆపని చేయించగలరా ? తమ ఎన్నికల బహిష్కరణను తమిళనాడులో ఒకపుడు జయలలిత చేసిన పనితో పోల్చుకోవటం కూడా విచిత్రంగానే ఉంది.

ఎందుకంటే తమిళనాడులో స్ధానిక ఎన్నికలను బహిష్కరించిన జయలలిత ఎన్నికల ప్రక్రియకు నూరుశాతం దూరంగా ఉండిపోయారు. కానీ టీడీపీ పరిషత్ ఎన్నికల్లో అలా చేయలేదు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేవలం ప్రకటించారంతే. గెలుపు కోసం తమ్ముళ్ళు చాలా గట్టిగానే ప్రయత్నించారు. కాకపోతే ఫలితాలే అనుకూలంగా రాలేదు. ఎన్నికలన్నాక గెలుపోటములు అత్యంత సహజం. ఈ విషయాన్ని మరచిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేసి గెలిచిన ఎన్నికలు కూడా ఓ గెలుపేనా అని మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. మరి గెలిచిన తమ అభ్యర్ధుల రాజీనామాపై అచ్చెన్నాయుడో లేకపోతే చంద్రబాబునాయుడో ఓ ప్రకటన చేస్తారా ?