Begin typing your search above and press return to search.

ధర్మవరంపై పట్టు : పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ..?

By:  Tupaki Desk   |   15 Jun 2022 3:30 AM GMT
ధర్మవరంపై పట్టు : పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ..?
X
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరటాల ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ వేరే లెవెల్ అన్న సంగతి తెలిసిందే. పరిటాల రవి అంటేనే ఈ రోజుకీ అక్కడ పార్టీ జనాలతో పాటు సాధారణ జనాలు కూడా తలచుకుంటారు. ఆయన ఉన్నంతవరకూ అనంతపురాన్ని టీడీపీకి కంచుకోటగా చేశారు. ఆయన హవా అలా సాగుతూండగానే దారుణ హత్యకు గురి అయ్యారు. దాంతో ఆయన సతీమణి సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ఆమె పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత క్యాబినేట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. ఆయన అక్కడ దూకుడుగానే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాప్తాడు టికెట్ సునీతకే అని చెబుతున్నారు.

ఇక ధర్మవరం లో కూడా పరిటాల ఫ్యామిలీకి పట్టుంది. దాంతో పరిటాల వారసుడు శ్రీరాం కి అక్కడ నుంచి పోటీకి టికెట్ అడిగినా 2019 ఎన్నికల వేళ చంద్రబాబు నాడు ఇవ్వలేదు. అక్కడ మొదటి నుంచి ఉన్న వరదాపురం సూరికే టికెట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో ధర్మవరం పరిటాల రవికి అప్పగించారు చంద్రబాబు. దాంతో అక్కడ ఇంచార్జిగా మూడేళ్ళుగ బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో తల్లికి రాప్తాడు, తనయుడుకి ధర్మవరం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ అధినాయకత్వం ముందు పెడుతున్నారు. అయితే ఈ మధ్యలో ట్విస్ట్ ఏంటి అంటే మళ్ళీ టీడీపీ వైపు వరదాపురం సూరి చూస్తున్నారు అని.

ఆయన ఎన్నికలకు కాస్తా ముందుగా టీడీపీలో చేరి టికెట్ కొట్టేస్తారు అన్న ఆందోళన అయితే పరిటాల అనుచరులలో ఉంది. ధర్మవరంలో చూస్తే సూరికి కూడా పట్టుంది. అలాగే పరిటాల కూడా ఈ మధ్యలోనే తన వర్గాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. దాంతో ఈ ఇద్దరి మధ్య ధర్మవరం సీటు కోసం టీడీపీలో ఫైటింగ్ యమ రేంజీలో సాగుతోంది.

చంద్రబాబు పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికే టికెట్లు అని పదే పదే చెబుతూండడంతో దాన్ని పరిటాల అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఓడగానే కాడె వదిలేసి వెళ్ళిపోయిన వరదాపురం సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చినా టికెట్ ఇవ్వవద్దు అని కూడా స్పష్టంగా చెబుతున్నారు. అయితే వరదాపురం కొత్త ఎత్తు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరితే ఆ కోటాలో టికెట్ ఎగరేసుకుని పోవడానికి చూస్తున్నారుట.

మొత్తానికి పరిటాల రవి వారసుడి ఈసారి పోటీ చేయాలనుకుంటే సీటు మాత్రం తెగ ఇబ్బంది పెట్టోస్తోంది అంటున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం ఆలోచన ఏంటి అంటే రాప్తాడు మాత్రమే పరిటాల ఫ్యామిలీకి కేటాయించి తల్లీ కొడుకులలో ఎవరో ఒకరు అక్కడ నుంచి పోటీకి రెడీ కమ్మని చెప్పడమట. వరదాపురం సూరి టీడీపీలో కి వస్తే ధర్మవరం ఆయనకే ఇవ్వాలని చూస్తున్నారని టాక్.

దీంతో పరిటాల శ్రీరాం వర్గం గరం గరం అవుతోంది. పార్టీ కోసం ఎంతో చేసిన పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అని పట్టుపడుతోందిట. ఈ విషయం మీద లోకేష్ తో టచ్ లో ఉంటూ శ్రీరాం తన పంతం నెగ్గించుకునేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యేట్లుగా ఉందని అంటున్నారు.

ఏది ఏమైనా ఈసారి రెండు టికెట్లు సాధించి గెలిచి వచ్చి అసెంబ్లీలో తల్లీ కొడుకులు ఇద్దరూ ప్రవేశించాలని చూస్తున్నారుట. మరి టికెట్లు అనుకున్నట్లుగా సాధించి టీడీపీలో పరిటాలా ఫ్యామిలీనా మజాకానా అనిపిస్తారట. సో అనంత టీడీపీలో పరిటాల బ్రాండ్ హాట్ హాట్ పాలిటిక్స్ ఇపుడు సాగుతోంది అని అంటున్నారు.