Begin typing your search above and press return to search.

పార్టీ ప్రకటన అవసరం లేదా సునీతమ్మ? ఎవరికి వారే ప్రకటించుకోవటమా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 AM GMT
పార్టీ ప్రకటన అవసరం లేదా సునీతమ్మ? ఎవరికి వారే ప్రకటించుకోవటమా?
X
ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి? పార్టీ టికెట్ ఎవరికి ఇస్తామన్న విషయాన్ని ఎన్నికలకు కాస్త ముందు ప్రకటించటం మామూలే. కొన్ని.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అందుకు భిన్నంగా.. పార్టీ అధినేత తనకు తానే.. తమ పార్టీ అభ్యర్థి ఫలానా అని ప్రకటించేస్తుంటారు. అందుకు భిన్నంగా ఎవరికి వారు.. తాము పోటీ చేసేది ఫలానా చోటు నుంచి అంటూ ప్రకటన చేసుకోవటం పెద్దగా ఉండదు. ఇప్పుడా పనినే చేస్తోంది పరిటాల కుటుంబం. అనంతపురం జిల్లా అన్నంతనే రాజకీయంగా గుర్తుకు వచ్చే పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఒకటి పరిటాల.

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే తాము పోటీ చేసే నియోజకవర్గాన్ని డిసైడ్ చేసేసుకొని.. అందుకు తగ్గట్లు గ్రౌండ్ ను సిద్దం చేసుకుంటోంది పరిటాల ఫ్యామిలీ. తాజాగా పరిటాల సునీతమ్మ ఒక సభలో మాట్లాడుతూ.. తన కొడుకును ధర్మవరం నియోజకవర్గ ప్రజల చేతుల్లో పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.అయితే.. పార్టీ ప్రకటన లేకుండా.. ఇలా ప్రకటనలు చేస్తే ఏలా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఇంతకీ పరిటాల ఫ్యామిలీకి కొత్త నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవటానికి కారణం లేకపోలేదు. ఆ విషయంపై స్పష్టత రావాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సిందే. పరిటాల కుటుంబానికి అనంతపురం జిల్లాలోని దక్షిణ ప్రాంతం మీద మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబం చెప్పిన వారే గెలుస్తుంటారు. ఇందుకు సాక్ష్యంగా పెనుగొండ నియోజకవర్గాన్ని చెబుతారు. ఇక్కడ నుంచి పరిటాల రవీంద్ర మూడుసార్లు ఎన్నికలయ్యారు.పరిటాల కుటుంబం ఆశీస్సులు ఉన్నాయంటే చాలు.. వారి మద్దతు ఇచ్చే విజయం గ్యారెంటీ అన్నట్లుగా ఉండేది. అయితే.. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ గా ఎంపిక చేయటంతో దీనిపై పరిటాల కుటుంబం ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.

దీంతో.. పరిటాల కుటుంబం రాప్తాడుకు వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014లలో పోటీ చేసిన పరిటాల సునీతమ్మ విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో ఆమె దూరంగా ఉన్నారు. అనూహ్యంగా పరిటాల శ్రీరామ్ బరిలోకి రావటం జరిగింది. షాకింగ్ అంశం ఏమంటే.. తమ కుటుంబం నుంచి ఎవరు బరిలో ఉన్నా.. అవతలవారి ఓటమి చూడటమే అలవాటైన పరిటాల కుటుంబానికి తగిలిన ఎదురుదెబ్బతో దిమ్మ తిరిగిపోయింది.

రోటీన్.. రొడ్డు కొట్టుడు రాజకీయ వ్యూహాల్లో నిమగ్రమై.. ఆశల పల్లకిలో విహరిస్తూవచ్చిన పరిటాల శ్రీరామ్ కు తగిలిన ఎదురు దెబ్బ ఆయన్ను.. ఆయన తల్లిని మరింత.. అప్రమత్తం అయ్యేలా చేసింది. అందుకే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాన్ని మాత్రమే కాదు.. నియోజకవర్గాన్ని మార్చేసుకున్నారు.దీనికి మరో కారణం లేకపోలేదు. 2019లో పరిటాల శ్రీరామ్ మీద పోటీ చేసి ఘన విజయాన్ని నమోదు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. అంచనాలకు మించి అనూహ్యంగా వ్యవహరిస్తూ.. నియోజకవర్గంలోని పెండింగ్ పనుల్ని పూర్తి చేయటంతో ఆయన పేరు మారుమోగుతోంది. అన్నింటికి మించి.. పేరూరు రిజర్వాయర్ కు కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించుకోవటంలో ఆయన సక్సెస్ కావటంతో.. దశాబ్దాల నాటి కలను సాకారం చేశారన్న పేరును సొంతం చేసుకున్నారు. ఇలాంటి వేళలో.. ప్రకాశ్ రెడ్డి మీద పోటీ చేయటం తెలివైన పని కాదన్న భావనకు వచ్చిన పరిటాల ఫ్యామిలీ.. తాజాగా తమ నియోజకవర్గాన్ని పొరుగున ఉన్న ధర్మవరానికి మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఇటీవల అక్కడ జరిగిన సమావేశానికి హాజరైన పరిటాల సునీత.. తన కొడుకును ధర్మవరం నియోజకవర్గ ప్రజల చేతుల్లో పెడుతున్నానని.. ఆశీర్వదించాలని కోరారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయటం ఖాయమైంది. అయితే.. పార్టీ అధినేత ప్రకటన లేకుండా.. పరిటాల కుటుంబమే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవటం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్న శ్రీరామ్.. తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే.. ఇక్కడే మరో సమస్య ఉందని చెబుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున పర్యటిస్తున్న ఆయన.. పట్టు పెంచుకున్నారు. దీనికి తోడు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో పాటు.. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే కేతిరెడ్డి.. తక్కువ సమయంలోనే నియోజకవర్గంలో తనదైన కోటను కట్టేసుకున్నారు. దాన్ని బద్ధలు కొట్టి.. పసుపు జెండా ఎగురవేయటం అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ ఎన్నిక పోటాపోటీగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదంటున్నారు.