Begin typing your search above and press return to search.

ప‌రిటాల మాట‌!...స‌గం తిన్నాం!

By:  Tupaki Desk   |   29 Dec 2018 7:51 AM GMT
ప‌రిటాల మాట‌!...స‌గం తిన్నాం!
X
టీడీపీ పాల‌న‌లో ఏపీలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోంద‌ని - అస‌లు ఈ తంతుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింద‌ని - ప్ర‌త్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అవినీతి ప‌తాక స్థాయికి చేరిపోయింద‌ని అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంతో పాటుగా ఆయా జిల్లాల నేత‌ల‌తో ప్ర‌త్యేక భేటీల సంద‌ర్భంగా పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... తిన‌డం కాస్త త‌గ్గించాల‌ని - లేదంటే వచ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్న వైనం కూడా తెలిసిందే. మొత్తంగా అటు విప‌క్షాల‌తో పాటు ఇటు ప్ర‌జానీకం ఆరోపిస్తున్న‌ట్లుగా ఏపీలో ఇప్పుడు అవినీతి ప‌తాక స్థాయికి చేరిపోయింద‌ని అధికార పార్టీ అధినేత సైతం ఒప్పేసుకున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

సాధార‌ణంగా రాజ‌కీయ నేత‌లు అవినీతికి పాల్ప‌డ్డా... గుట్టు చ‌ప్పుడు కాకుండా మ‌స‌లుకుంటూ ఉంటారు. ఎక్క‌డ త‌మ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతో న‌క్కి న‌క్కి వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే చేసిన అవినీతిని బ‌హిరంగంగా ఒప్పేసుకోవ‌డం ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌లేద‌నే చెప్పాలి. చంద్ర‌బాబు పాల‌న పుణ్య‌మా అని అది కూడా ఇప్పుడు సాక్షాత్క‌రించింది. పార్టీలో సీనియ‌ర్ నేత‌గా - బాబు కేబినెట్ లో సీనియ‌ర్ మంత్రిగా కొన‌సాగుతున్న ప‌రిటాల సునీత అవినీతి భాగోత‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోందని చెప్పాలి. ప‌రిటాల ఫ్యామిలీ - ఆ ఫ్యామిలీ అనుచ‌ర గ‌ణం సాగిస్తున్న దందాపై ఓ ప‌త్రిక మొన్నటి సంచిక‌లో ఓ పెద్ద క‌థ‌న‌మే రాసి పారేసింది. ప‌రిటాల ఫ్యామిలీ సొంత జిల్లా అనంత‌పురం జిల్లా టాబ్లాయిడ్‌ లోనే ఈ క‌థ‌నాన్ని తాటికాయ‌లంత అక్ష‌రాల‌తో ఓ రెండు పేజీల మేర దంచికొట్టింది.

ఈ క‌థ‌నం చూసిన వెంట‌నే ప‌రిటాల సునీత మిన్న‌కుండిపోయినా... ప‌రిటాల వార‌సుడు ప‌రిటాల శ్రీ‌రామ్ మాత్రం ఎంత స‌ర్దిచెప్పుకున్నా సైలెంట్ కాలేక‌పోయారు. ఇంకేముంది... అనుచ‌ర గ‌ణాన్ని వెంటేసుకుని స‌ద‌రు ప‌త్రిక కార్యాల‌యం ఉన్న ప్రాంతానికి చేరుకుని న‌డిరోడ్డుపై నిర‌స‌న‌కు దిగారు. ఈ నిర‌స‌న కార‌ణంగా అక్క‌డ దాదాపుగా రెండు గంట‌ల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. విష‌యం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు బీకే పార్థ‌సార‌ధి అక్క‌డికి వ‌చ్చి స‌ర్ది చెబితే గానీ... ఆందోళ‌న విర‌మించేందుకు ప‌రిటాల శ్రీ‌రామ్ వినిపించుకోలేద‌ట‌. ఇక నిర‌స‌న విర‌మించే స‌మ‌యంలో మైకు తెప్పించుకుని మ‌రీ... స‌ద‌రు ప‌త్రిక‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కిన శ్రీ‌రామ్‌... తాము అవినీతి చేసేశామ‌ని బ‌హిరంగంగానే ఒప్పేసుకున్నారు.

అవును రూ.3 కోట్ల మేర అభివృద్ధి ప‌నుల్లో స‌గం తిన్నా... మిగిలిన స‌గాన్ని అభివృద్ధి ప‌నుల కోసం వినియోగించాం క‌దా అంటూ శ్రీ‌రామ్ చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డికి వ‌చ్చిన సొంత పార్టీ కార్య‌కర్త‌లే షాక్ తిన్నార‌ట‌. తాము అవినీతికి పాల్ప‌డ‌కున్నా వార్త‌లు రాస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తార‌నుకుంటే... ప‌రిటాల స్వ‌యంగా నిధుల్లో సగం తిన్నా... మిగిలిన స‌గాన్ని అభివృద్ధికే వెచ్చించాం క‌దా అంటారేమిటంటూ పార్టీ కేడ‌ర్ త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ట‌. మొత్తంగా తాము స‌చ్ఛీలుర‌మ‌ని చెప్పుకునేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌రిటాల వార‌సుడు... తాము అవినీతికి పాల్ప‌డ్డామని ఒప్పేసుకోడం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కే తెర లేపింద‌ని చెప్పాలి. ఈ స‌రికొత్త ఆందోళ‌న‌పై పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏమంటారో చూడాలి.