Begin typing your search above and press return to search.

ఐదు రోజుల పెళ్లి కొడుకు..ప‌రిటాల శ్రీరామ్‌

By:  Tupaki Desk   |   1 Oct 2017 4:49 AM GMT
ఐదు రోజుల పెళ్లి కొడుకు..ప‌రిటాల శ్రీరామ్‌
X
సుదీర్ఘ విరామం త‌ర్వాత ప‌రిటాల వారింట్లో జ‌రుగుతున్న పెళ్లికి అనంత‌పురం జిల్లా రామ‌గిరి మండ‌లంలోని వెంక‌టాపురం గ్రామం ముస్తాబైంది. ఈ రోజు ప‌రిటాల శ్రీరాం (ఆదివారం - అక్టోబ‌రు1) వివాహ వేడుక జ‌ర‌గ‌నుంది. వాస్త‌వానికి నాలుగు రోజులుగా ప‌రిటాల వారింట పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి.. ఏపీ మంత్రి ప‌రిటాల సునీత పెద్ద‌కుమారుడి పెళ్లి వేడుక‌లు భారీ ఎత్తున సాగుతున్నాయి. పెళ్లికి నాలుగు రోజుల ముందు నుంచే సంబ‌రాలు స్టార్ట్ అయ్యాయి. గ్రామ మ‌హిళ‌ల‌తో క‌లిసి శ్రీరామ్ మేన‌త్త ఉష త‌మ కుటుంబ సంప్ర‌దాయాల్ని పాటిస్తూ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌డిచిన నాలుగు రోజులుగా శ్రీరామ్‌ ను వివిధ ప‌ద్ద‌తుల్లో పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తున్నారు.

ప‌రిటాల ర‌వి మ‌ర‌ణం త‌ర్వాత వారింట్లో జ‌రుగుతున్న తొలి శుభ‌కార్యం కావ‌టంతో ప‌రిటాల కుటుంబంలోనూ.. వారి అభిమానుల్లోనూ ఈ కార్య‌క్ర‌మం ఉద్వేగాల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ప‌రిటాల శ్రీరామ్ పెళ్లి వేడుక‌ల నేప‌థ్యంలో గ‌డిచిన నాలుగు రోజులుగా చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోని యువ‌కుల‌తో పాటు.. ఏపీకి చెందిన ప‌లువురు రాజ‌కీయ నేత‌లు వెంక‌టాపురానికి క్యూ క‌డుతున్నారు. వ‌చ్చిన అతిధుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ప‌రిటాల సునీత బిజీబిజీగా ఉన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. పెళ్లి ప‌నులు భారీగా జ‌రుగుతుండ‌టంతో.. పెద్ద ఎత్తున మ‌హిళ‌లు.. యువ‌కులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ప‌నుల బాధ్య‌త‌ల్ని తీసుకోవ‌టం విశేషం.

పెళ్లి ఏర్పాట్ల‌ను శ్రీరామ్ తాత‌లు.. కుటుంబ పెద్ద‌లు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పెళ్లి వేదిక‌ను ప‌రిటాల ర‌వి ఘాట్‌ కు స‌మీపంలోని వారింట్లో తూర్పు భాగంలో పొలంలో నాలుగు ఎక‌రాలలో పెళ్లి పందిరిని సిద్ధం చేశారు. భారీ ఎత్తున సెట్టింగుల‌తో క‌ల్యాణ మండ‌పం సిద్ధ‌మైంది. ఈ పెళ్లికి దాదాపు మూడున్న‌ర ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. వ‌ర్షం వ‌చ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

పెళ్లి వేడుక‌ల సంద‌ర్భంగా మంత్రి ప‌రిటాల సునీత మంత్రి హోదాను ప‌క్క‌న ప‌డేసి.. త‌ల్లిగా ఆమె అన్ని కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోవ‌ట‌మే కాదు.. వంట‌లోనే చేయి వేస్తున్నారు. స్వీట్ల త‌యారీ మొద‌లుకొని అన్ని కార్య‌క్ర‌మాల్ని చూస్తున్న ఆమె.. వ‌చ్చిన ప్ర‌తి ఒక్క అతిధిని అప్యాయంగా ప‌లుక‌రిస్తున్నారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు అయిన కొడుకును చూసుకొని మురిసిపోతున్నారు.

పెళ్లికి వ‌చ్చే వారి భోజ‌నాల కోసం 350 క్వింటాళ్ల బియ్యాన్ని సిద్ధం చేశారు. వారిఅంచ‌నా ప్ర‌కారం ఒక్కో క్వింటాళ్ల బియ్యం 800 మందికి స‌రిపోతుంద‌న్న లెక్క చెబుతున్నారు. ల‌క్ష‌ల్లో వ‌చ్చే అతిధుల కోసం మంచినీటి సౌక‌ర్యంతో పాటు.. డ్రైనేజీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. 200 కుళాయిల్ని ఏర్పాటు చేశారు. మూడు ర‌కాల స్వీట్ల‌తో మొత్తం 30 ఐటెమ్స్ మెనూను సిద్ధం చేశారు. వీటిల్లో సీమ రుచుల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేలా మెనూను డిజైన్ చేశారు. సీమ‌తో పాటు కోస్తాకు చెందిన 400 మంది వంట మాస్ట‌ర్లు పెళ్లి ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నారు. పెళ్లి మండ‌పం త‌యారీ గ‌డిచిన నెల రోజులుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

పెళ్లి వేడుక‌లో 50వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 50 వేల మంది భోజ‌నాలు చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ ఎత్తున భోజ‌న ఏర్పాట్లు చేయ‌టం ప‌రిటాల కుటుంబంలో మామూలే. ప‌రిటాల ర‌వి వ‌ర్థంతి సంద‌ర్భంగా భారీగా త‌ర‌లివ‌చ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను గ‌తంలో చేశారు. ప‌రిటాల కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులంతా పెళ్లికి త‌ర‌లి వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా అతిధులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు. అందులోకి పెళ్లి వేడుకకు సెల‌వు క‌లిసి రావ‌టంతో అతిధుల పోటు మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టం ఖాయం.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే శ్రీరాం పెళ్లి వేడుకుల‌కు 2.70 ల‌క్ష‌ల పెళ్లి కార్డులు ప‌రిటాల ఫ్యామిలీ అచ్చేయిస్తే.. మ‌రో 30 వేల కార్డులు వారి అభిమానులు ప్రింట్ చేయించి పంచిన‌ట్లుగా చెబుతున్నారు. శ్రీరామ్ పెళ్లి వేడుక్కి రావాలంటూ గ్రామ‌స్తులు స్వ‌యంగా కార్డులు తీసుకొని ఇంటింటికి వెళ్లి పిలుస్తున్న వైనం స‌రికొత్త‌గా ఉంద‌ని చెప్పాలి. శ్రీరాం బాబు పెళ్లి వేడుక‌ల్ని ప్ర‌జ‌లే ద‌గ్గ‌ర ఉండిచేయించ‌టం చాలా ఆనందంగా ఉన్నార‌ని చెబుతున్నారు ప‌రిటాల సునీత‌.

ఎవ‌రికి వారు వ‌చ్చి త‌మ‌కు కూడా పెళ్లి ప‌నులు అప్ప‌గించాల‌ని కోరుతున్నార‌న్నారు. వారు అలా వ‌చ్చి అడ‌గ‌టం త‌న‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంద‌న్నారు. ఇక‌.. శ్రీరామ్ పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌రు కానున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ల‌లో రానున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక హెలిపాడ్ల‌ను సిద్ధం చేశారు. ఇరువురు ముఖ్య‌మంత్రులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పెళ్లి వేడుక‌కు రానున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇక‌.. రెండు రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు ప‌లువురు ఈ పెళ్లికి హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక కోసం 1700 మంది పోలీసులు బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌..ఎస్పీలు పెళ్లి వేడుక‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు రానుండ‌టంతో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆకాశ‌మంత పందిరి.. భూదేవంత మండ‌పం అన్న నానుడికి త‌గ్గ‌ట్లే ప‌రిటాల శ్రీరాం పెళ్లి వేడుక జ‌రుగుతుంద‌న‌టంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.