Begin typing your search above and press return to search.

ఆ రెండూ ప‌రిటాల కుటుంబానికే కావాల‌ట‌

By:  Tupaki Desk   |   7 Sep 2017 6:42 AM GMT
ఆ రెండూ ప‌రిటాల కుటుంబానికే కావాల‌ట‌
X
పరిటాల రవి...అనంతపురం జిల్లాలో - తెలుగుదేశం రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పరిటాల ర‌వి దివంగ‌తుడైన త‌ర్వాత ఆయ‌న‌ సతీమణి సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు పరిటాల శ్రీరామ్. తెలుగుదేశం యువనేతగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో శ్రీరామ్ రాజకీయాల్లోకి దిగాలని భావించినప్పటికీ...కొన్ని కారణాల వల్ల వీలుపడలేదు. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో ఈ స్కెచ్ వ‌ర్క‌వుట్ కావాలని యోచిన‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే ఉన్న కుంప‌ట్ల స‌రిపోవ‌న్న‌ట్లుగా ఇదో కొత్త స‌మ‌స్యగా విశ్లేష‌కులు చెప్తున్నారు.

ప్రస్తుతం పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ నియోజకవర్గంలో తల్లి సునీతను అలాగే ఉంచి... భవిష్యత్ రాజకీయ అరంగేట్రం కోసం తను మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని శ్రీరామ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం పలు నియోజకవర్గాలపై శ్రీరామ్ దృష్టిసారించార‌ని అంటున్నారు. అనంతపురం - ధర్మవరం - పెనుకొండ నియోజకవర్గాలపై శ్రీరామ్ దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఉన్నారు! దీంతో సదరు ఎమ్మెల్యేల్లో భయం మొదలైందట. పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే కొద్దికాలం క్రితం మంత్రి సునీత ఈ నియోజక‌వ‌ర్గంలోని నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ప‌రిణామంతో పార్థ‌సార‌థిలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని స‌మాచారం. ఇదే భావ‌న‌లో మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు ఉన్న‌ట్లు అంటున్నారు. శ్రీరామ్ తమ నియోజకవర్గాలపై కన్నేస్తే తమకు కష్టమేనని, తమ భవిష్యత్తుపై ఆ విధంగా ఎక్కడ దెబ్బకొడతాడో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా శ్రీరామ్ ను పరిమిత పాత్రకు తగ్గించాలని, అతడు తమపై అధికారాన్ని చెలాయించే లోపే కట్టడి చేయాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం.

తమ నియోజకవర్గంలో శ్రీరామ్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వారు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సమాచారం. మంత్రి కుమారుడు - రాజకీయ నేతకు వారసుడు అయిన వ్యక్తి తమను ఇబ్బందులకు గురిచేసేలా నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారని దిశగా శ్రీరామ్ ను నిలువరించేందుకు సదరు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ శ్రేణులే ప‌రిటాల శ్రీ‌రామ్ ల‌క్ష్యంగా పావులు కదుపుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని అంటున్నారు.