Begin typing your search above and press return to search.

ప‌రిటాల మాట‌!..హాని చేసే ప్ర‌తోడు శ‌త్రువే!

By:  Tupaki Desk   |   22 Sep 2017 3:56 PM GMT
ప‌రిటాల మాట‌!..హాని చేసే ప్ర‌తోడు శ‌త్రువే!
X
టీడీపీలో కీల‌క నేత‌గా ఎదిగి, మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి... ఆ త‌ర్వాత దారుణ హ‌త్య‌కు గురైన ప‌రిటాల రవీంద్ర వార‌సుడిగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఆయ‌న కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌... మాట క్ర‌మంగా రాటు దేలుతోంద‌న్న మాట వినిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా జ‌నంలోకి వ‌చ్చిన శ్రీ‌రామ్‌... ఆ ఎన్నిక‌ల్లో త‌న త‌ల్లి ప‌రిటాల సునీత‌ను గెలిపించుకునేందుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఎన్నిక‌ల సంద‌ర్భంగా వాహ‌నాల్లో బ‌య‌లుదేరిన శ్రీ‌రామ్‌... పోలీసులు నిలిపేసిన క్ర‌మంలో ప‌రార‌య్యార‌న్న వార్త కూడా నాడు జ‌నాల్లో బాగానే నానింద‌ని చెప్పాలి.

ఆ ఎన్నిక‌లు ముగిసి ఇప్ప‌టికే మూడున్న‌రేళ్ల‌కు పైగా అవుతుండ‌గా, మ‌రో ఏడాదిన్న‌ర‌లో 2019 ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో శ్రీ‌రామ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తార‌న్న వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తోంది. ప‌రిటాల రవి వార‌సుడిగా శ్రీ‌రామ్‌ ను తెరంగేట్రం చేయించేందుకు రాష్ట్ర మంత్రిగా ఉన్న సునీత ఇప్ప‌టికే దాదాపుగా రంగం సిద్ధం చేశార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సంద‌ర్భంగా ప‌రిటాల శ్రీ‌రామ్ చేసిన ప్ర‌సంగం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తండ్రికి త‌గ్గ‌ట్టుగానే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ఏమాత్రం బెదిరేది లేద‌న్న రీతిలో ముందుకు సాగాల‌ని శ్రీ‌రామ్ భావిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌సంగం చెప్ప‌క‌నే చెబుతోంది.

అనంత‌పురం జిల్లాలోని ఓ ప‌ల్లెలో జ‌రిగిన స‌భ‌కు త‌ల్లితో క‌లిసి వెళ్లిన శ్రీ‌రామ్‌... అక్క‌డి జ‌నం హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. *మేము మొండినా కొడుకులం. బండనా కొడుకులం. మాకు హాని తలపెట్టని వాళ్లంతా మావాళ్లే. మావాళ్లకు హాని తలపెట్టే ప్రతి ఒక్కడూ మాకు శత్రువే. రాబోయే రోజుల్లో పరిటాల చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాణత్యాగం స్ఫూర్తితో ముందుకు సాగుతాం* అని శ్రీ‌రామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న త‌ల్లి సునీత ప‌క్క‌న ఉండ‌గానే... శ్రీ‌రామ్ నోట నుంచి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వినిపించ‌డం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీ‌రామ్ ప్ర‌సంగంతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గానే మారిపోయింది. మరి ఈ వీడియోపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.