Begin typing your search above and press return to search.

ప‌రిటాల వార‌సుడి గాలివాటం రాజ‌కీయం ?

By:  Tupaki Desk   |   9 May 2021 4:39 AM GMT
ప‌రిటాల వార‌సుడి గాలివాటం రాజ‌కీయం ?
X
తండ్రి తాలూకు వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో తండ్రి సంపాయించుకున్న పేరును, ఫేమ్‌ను సంపాదించుకోవ‌డంలో మాత్రం వార‌సులు ఫెయిల్ అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ప‌రిటాల ర‌వి కుటుంబం నుంచి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిటాల శ్రీరామ్.. రాజ‌కీయంగా త‌న ఫ్యామిలీకి ఉన్న బ్రాండ్‌తో పోల్చుకుంటే త‌న స‌త్తాను చాట‌లేక పోతున్నారు. అదే స‌మ‌యంలో త‌న తండ్రి తాలూకు హ‌వాను కూడా ఆయ‌న అందిపుచ్చుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

నిజానికి ప‌రిటాల ర‌వికి.. జిల్లా వ్యాప్తంగా ప‌ట్టుంది. మ‌రీ ముఖ్యంగా నాలుగు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న చిటికె వేసి శాసించిన రోజులు కూడా ఉన్నాయి. పెనుకొండ‌, ధ‌ర్మ‌వ‌రం, రాప్తాడు... ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌వి పేరుకు తిరుగులేదని అంటారు. వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు కూడా ఆయ‌నకు సొంతం. జిల్లాలో ర‌వి వేసిన పునాదితోనే 2004, 2009 ఎన్నిక‌ల్లో పార్టీ రాష్ట్రంలో ఓడిపోయినా జిల్లాలో మాత్రం 6 సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఇక ప‌రిటాల ఫ్యామిలీ సైతం పెనుగొండ‌, రాఫ్తాడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ కంచుకోట‌లుగా మార్చుకుంది. ర‌వి, ఆ త‌ర్వాత సునీత ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌రుస విజ‌యాలు సాధించి మంత్రులుగా కూడా ప‌నిచేశారు.

ఇంత బ‌ల‌మైన పునాది ఉండి కూడా శ్రీరామ్ రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో దూసుకుపోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌లో రాప్తాడు నుంచి పోటీ చేసిన ఆయ‌న అన్య‌మ‌న‌స్కంగానే నామినేష‌న్ వేశారు., ఆయ‌న కోరుకుంది.. పెనుకొండ‌, కానీ.. చంద్ర‌బాబు రాప్తాడునే కేటాయించారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక శ్రీరామ్ రాఫ్తాడులో పార్టీని ప‌టిష్టం చేయ‌డంపై దృష్టి పెట్ట‌డం లేదు. అయితే ధ‌ర్మ‌వ‌రంలోనూ టీడీపీ నాయ‌కుడు లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ప‌రిటాల ఫ్యామిలీకి రెండు ఆప్ష‌న్లు ఇస్తున్నాన‌ని... సునీత‌, శ్రీరామ్‌లో ఎవ‌రు ఎక్క‌డ పార్టీని ప‌టిష్టం చేస్తారో వారికే చాయిస్ ఇస్తున్నాన‌ని చెప్పారు.

శ్రీరామ్ మాత్రం ధ‌ర్మ‌వ‌రం, లేదా పెనుకొండ‌ల‌పైనే దృష్టి పెట్టారు త‌ప్ప‌.. రాప్తాడును మాత్రం చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నారు. నిజానికి రాజ‌కీయాల‌న్నాక‌.. గెలుపు ఓట‌ములు మామూలే.. కానీ.. ఓడిపోయిన నేప‌థ్యంలో అస‌లు రాప్తాడునే ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డం.. శ్రీరామ్ రాజ‌కీయాలకు ఇబ్బందిక‌రంగా మారుతోంది. రాఫ్తాడు టీడీపీ కేడ‌ర్ అయితే అధికారంలో ఉన్న‌ప్పుడు అనుభ‌వించి... ఇప్పుడు త‌మ‌ను ప‌రిటాల ఫ్యామిలీ గాలికి వ‌దిలేసింద‌ని వాపోతున్నారు.