Begin typing your search above and press return to search.

సీమలో పరిటాల - బాలయ్య పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   25 Feb 2019 6:21 AM GMT
సీమలో పరిటాల - బాలయ్య పరిస్థితేంటి?
X
అధికార టీడీపీలో టికెట్ల గొడవ మొదలైంది. చంద్రబాబు సీట్ల ఖరారును చేస్తుండడంతో ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో పనిచేయని పార్టీ సిట్టింగుల్లో గుబులు మొదలైంది. జిల్లాలు - పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులను అధినేత చంద్రబాబు ప్రకటిస్తుండడంతో టికెట్లు రాని వారు అగ్గి రాజేస్తున్నారు..

ఇప్పటికే కడప జిల్లా రాజంపేట - కర్నూలు పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు మొదటి జాబితా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ పేర్లు ప్రకటించిన జిల్లాల్లో కొన్ని చోట్ల కొత్త ముఖాలకు ప్రాధాన్యమిస్తున్నారు. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు.

ఇక అనంతపురం నియోజకవర్గ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు తెరమీదకి రావచ్చని టీడీపీ వర్గాలంటున్నాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కూడా ఒకటి రెండు స్థానాల్లో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత పకడ్బందీగా వచ్చే ఎన్నికల కోసం నాయకులను - కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ఇక హిందూపురం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే బాలక్రిష్ణ వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నారు. అసలు పోటీచేస్తాడో లేదోనన్న అనుమానాలున్న నేపథ్యంలో బాలయ్య ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగడంతో ఈసారి కూడా బాలయ్య హిందూపురం నుంచే బరిలో నిలుచుంటాడని ఖాయమైంది. ఇక రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు - మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలంతా పార్టీని గెలిపించుకోవడానికి నాయకులను - కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలకు గాను.. ఐదు నియోజకవర్గాలపైనే టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ప్రధానంగా శింగనమల - పుట్టపర్తి - కళ్యాణదుర్గం - కదిరి - గుంతకల్లు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ నియోజకవర్గాల్లో కొన్నింటిలో కొత్త వారికి అవకాశాలు కల్పించాలని బాబు సూచన ప్రాయంగా నిర్ణయించారని సమాచారం.