Begin typing your search above and press return to search.

మహిళా మంత్రులు వంట ముచ్చట

By:  Tupaki Desk   |   8 March 2017 5:08 AM GMT
మహిళా మంత్రులు వంట ముచ్చట
X
మహిళలు వంట చేయడమన్నది ప్రపంచవ్యాప్తంగా.. ప్రాచీన కాలం నుంచి ఉన్న అలవాటే కానీ, సమయం - సందర్భం బట్టి ఒక్కోసారి వారు ఆ బాధ్యతలకు దూరంగా ఉంటారు. అందులోనూ... తాము చేయి వేయకపోయినా వంట పని సజావుగా సాగిపోతుంటే మహిళలు వంటింట్లోకి వెళ్లాల్సిన అవసరమే లేదు. కానీ... ఏపీలో మంత్రులుగా ఉన్న పరిటాల సునీత - పీతల సుజాతలు మాత్రం ప్రభుత్వం పరంగా ఎంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నా అందులో పాల్గొనడం మానేసి వంట గది దగ్గరకు వెళ్లిపోతున్నారట. తాజాగా అసెంబ్లీ జరుగుతున్నా కూడా వారు అక్కడ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసే పనుల్లో దూరుతున్నారట.

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్‌ లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ ను పరిశీలించేందుకు మంత్రులు పరిటాల సునీత - పీతల సుజాత వచ్చారు. కిచెన్‌ లోకి రాగానే పకోడీల ఘుమఘుమలు వారిని పలకరించాయి. ‘మేం మరింత బాగా వేస్తా’మంటూ ఇద్దరూ పిండి కలిపి - బాణలిలో పకోడీలు వేయించి, అందరికీ పంచారు. అనంతరం సచివాలయం ఉద్యోగులతో కలసి భోజనం చేశారు.

గతంలో అమరావతి భూమిపూజ సమయంలోనూ, ఇతర సందర్భాల్లోనూ వీరు వంట గదుల వల్ల పలుమార్లు కనిపించారు. అందులో తప్పు పట్టాల్సినది ఏమీ లేకున్నా కూడా కీలక బాధ్యతల్లో ఉన్న నేతలుగా వీరు సభలు జరుగుతున్నప్పుడు కూడా ఇలా వంట సరదా తీర్చుకుంటూ అసలు పని మానేయడంపైనే విమర్శలొస్తున్నాయి. మహిళా సాధికారత కోసం ప్రపంచమంతా నినదిస్తున్న సమయంలో.. మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు ఇలా సాధికారత కంటే సాధారణ వ్యవహారాలపైనే మక్కువ చూపడం ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/