Begin typing your search above and press return to search.

ఏంటి సంగతి? : సమీకరణాలు మారుతున్నాయే?

By:  Tupaki Desk   |   6 March 2018 4:14 PM GMT
ఏంటి సంగతి? : సమీకరణాలు మారుతున్నాయే?
X
ప్రత్యేకహోదా మీద జరుగుతున్న పోరాటాల పుణ్యమాని.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అటు ఇటూ మారుతున్నాయా.? ఈ దెబ్బతో ఏపీలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగబోతున్నదా? అనూహ్యమైన మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నదా? అని తాజా పరిణామాలను గమనిస్తోంటే అనిపిస్తోంది. ‘మాలో మాకు విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే మేమంతా ఒక్కటే’ అంటూ పార్లమెంటులో తెలుగుదేశం నాయకులు సాగిస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు - రేణుకా చౌదరి మద్దతివ్వడం విశేషం. ఇక్కడే కొత్త అనుమానాలు రేగుతున్నాయి.

నిన్నటికి నిన్న- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వామపక్షాల నాయకులు, చలసాని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. నిజానికి వామపక్ష నాయకులు కూడా ఇటీవలి కాలంలో.. తెలుగుదేశం చర్యలను సమర్థిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చలసాని శ్రీనివాస్ మీద కూడా తెదేపా అనుకూల ఉద్యమ కారుడిగా ముద్ర ఉంది! మరి ఆ కోటరీ పట్ల సానుభూతి ఉండే వారంతా వచ్చి జగన్ పార్టీ చేపట్టిన ధర్నాలో.. రెచ్చిపోయి హోదాకోసం ప్రసంగాలు చేశారు.

ఇవాళ- పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్షలకు వారి ఆజన్మ శత్రువులు అయిన కాంగ్రెస్ నాయకులు వచ్చి మద్దతివ్వడం విశేషం. అసలే కరడుగట్టిన కాంగ్రెస్ ఎంపీలు... పైగా వారిలో ఒకరైన రేణుకాచౌదరి.. పక్కా తెలంగాణ వాది.. తెలంగాణ ఎంపీ కూడా. ఆమెకూడా వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో హోదా కొరకు డిమాండ్ చేస్తూ పోరాటం సాగించడంలో నిజానికి అన్ని పార్టీల కంటె కూడా సీనియర్ అని చెప్పాలి. ఆయన సాధించింది ఏమీ లేకపోయినా.. పోరాటం మాత్రం అలుపెరగకుండా చేస్తూనే ఉన్నారు. అలాంటి కేవీపీ కూడా తెదేపా వారి నిరసనల్లో వచ్చి పాల్గొన్నాడు.

చూడబోతే.. ఇదేమైనా భవిష్యత్ రాజకీయ పరిణామాలను సంకేతరూపంలో తెలియజేస్తున్న సంగతా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. చంద్రబాబునాయుడు అవసరమైతే భాజపాతో కటీఫ్ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో.. అధికారాన్ని అందించే మ్యాజిక్ పర్సంటేజీ ఆఫ్ వోట్స్ కావాలంటే ఆయనకు ఎవరో ఒకరి పొత్తు అవసరం.. అందుకోసం కాంగ్రెస్ మీద ఈసారి ఆధారపడతారా అనే ప్రచారం కూడా షురూ అవుతోంది.