Begin typing your search above and press return to search.

పార్లమెంట్ సమావేశాలకు వైరస్ ఎఫెక్ట్ ...రోజు మార్చి రోజు !

By:  Tupaki Desk   |   2 Jun 2020 3:30 PM GMT
పార్లమెంట్ సమావేశాలకు వైరస్ ఎఫెక్ట్ ...రోజు మార్చి రోజు !
X
వైరస్ సృష్టించిన అలజడికి అన్నీ మారిపోతున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పేరుతో కొత్త లైఫ్ స్టైల్‌ కు అలవాటుపడుతున్నాం. వైరస్ ఇప్పట్లో పూర్తిగా దూరమవుతుందన్న సంకేతాలైతే కనుచూపు మేరలో లేవు. ఈ తరుణంలోనే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల తీరు కూడా మారిపోవచ్చు. ఓ రోజు లోక్‌సభ, మరో రోజు రాజ్యసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్లమెంట్ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చ మొదలైంది. స్పీకర్ ఓం బిర్లాతో పాటు, ఛైర్మన్ వెంకయ్యనాయుడు దీనిపై కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తుంది.

ఈ వైరస్ కారణంగా భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ సమావేశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సమావేశాల తీరు తెన్నులను మార్చేసి పార్లమెంట్ కాంప్లెక్స్‌ లో రద్దీ తగ్గించే దిశగా కసరత్తు మొదలయ్యింది. వైరస్ కారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చిలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వచ్చే నెలలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఒక్కసారి పార్లమెంట్ సమావేశాలు మొదలైతే పార్లమెంట్ భవనం మొత్తం వేలాది మందితో నిండిపోతుంది. లోక్‌ సభ రాజ్యసభ ఎంపీలతో పాటు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా...ఇలా అందరూ పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ చుట్టూ తిరుగుతారు.

దీని వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోక్‌సభ రాజ్యసభ సమావేశాలను ఒకే రోజు కాకుండా ఒక రోజు లోక్‌సభ, మరుసటి రోజు రాజ్యసభ భేటీ అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్‌ సభ సమావేశాలను పార్లెమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం కోసం దీనిని నిర్మించడంతో విశాలంగా ఉంటుంది. వైరస్ భయంతో సభ్యులు రావడానికి నిరాకరించడంతో బుధవారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ భేటీని వాయిదా వేశారు.