Begin typing your search above and press return to search.

వైర‌ల్: సెల్లు ఫోను తీశాడు మా సారు... బాత్రూమ్ లో దూరాడు మా సారు!

By:  Tupaki Desk   |   29 July 2022 1:30 PM GMT
వైర‌ల్: సెల్లు ఫోను తీశాడు మా సారు... బాత్రూమ్ లో దూరాడు మా సారు!
X
ఒక‌ప్పుడు ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు విద్యార్థుల‌కు బోధించ‌డం త‌ప్ప మ‌రే ఇత‌ర ప‌ని ఉండేది కాదు. విద్యార్థుల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్ద‌డ‌మే వారి లక్ష్యంగా ఉండేది. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మేణా టీచ‌ర్లను ఆయా ప్ర‌భుత్వాలు ఇష్టానుసారంగా వాడుకోవ‌డం మొద‌లుపెట్టాయి. జ‌నాభా లెక్క‌లు, విద్యార్థుల అడ్మిష‌న్ల‌ను, వారికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల మార్కుల‌ను ఆన్‌లైన్లో ఎక్కించ‌డం వంటి పనులను వారికి క‌ట్ట‌బెట్టారు.

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాడు నేడు కింద చేప‌డుతున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఫొటోలు తీయ‌డం, వాటిని వాట్సాప్ గ్రూపుల‌కు పంప‌డం, పై అధికారుల‌కు చేర‌వేయ‌డం వంటి పనులూ ఉపాధ్యాయుల‌కూ త‌ప్ప‌డం లేదు. అలాగే విద్యార్థుల హాజ‌రు బ‌యోమెట్రిక్ ను చెక్ చేయ‌డం, దాన్ని వ‌లంటీర్ల‌కు పంప‌డం, అలాగే ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ స‌ర్వేల కోసం ఉపాధ్యాయుల‌ను ప్ర‌తి ఇంటికీ తిప్పుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు వేరే ప‌నుల్లో ఉండ‌టం లేదంటే ప్ర‌భుత్వం అప్ప‌గించిన ప‌నుల మీద బ‌య‌ట‌కు వెళ్ల‌డం వంటి కార‌ణాల‌తో విద్యార్థుల‌కు బోధ‌న కుంటుప‌డుతోంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయుల క‌ష్టాలు ఎలా ఉన్నాయో తెలియ‌జేస్తూ త‌మ క‌ష్టాల‌ను వివ‌రిస్తున్నారు. ఒక త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కంలో ఉన్న.. పొద్దున్నే లేచాడు మా మామ.. అనే పాట‌కు పేర‌డీగా త‌మ క‌ష్టాల‌ను ఏక‌ర‌వు పెడుతూ ఉపాధ్యాయులు దాన్ని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయ‌డం వైర‌ల్ గా మారింది. ఉపాధ్యాయుల జీవితం ఎలా దుర్బరంగా మారిందో వివ‌రిస్తూ ఈ పేర‌డీ పాట‌ను రూపొందించారు.

ఇది ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో మొద‌ట వ‌చ్చింద‌ని చెబుతున్నారు. స్కూల్ పేరు, దీన్ని పేర‌డీగా రూపొందించిన ఉపాధ్యాయుల పేర్ల‌ను గోప్యంగా ఉంచారు. ఉపాధ్యాయుల క‌ష్టాలు ఎలా ఉన్నాయో తెలిపే ఆ పేర‌డీ పాట ఇదిగో..


పొద్దున్నే వచ్చాడు మా సారు

సెల్లుఫోను తీశాడు మా సారు

బాత్రూంలో దూరాడు మా సారు

ఫొటోలెన్నో తీశాడు మా సారు

అప్‌లోడ్‌ చేశాడు మా సారు



క్లాసులోకి వచ్చాడు మా సారు

సెల్లుఫోను తీశాడు మా సారు

హాజరు యాప్‌ నొక్కాడు మా సారు

సిగ్నలే లేదంటూ బయటికెళ్లాడు

సబ్మిట్‌ అయిందని సంతోషపడ్డాడు


మళ్లొచ్చి కూర్చున్నాడు మా సారు

బీరువా తెరిచాడు మా సారు

బట్టలు, బూట్లు తీశాడు మా సారు

వలంటీరుకు ఫోన్‌ చేసి మా సారు

బయోమెట్రిక్‌ అడిగాడు మా సారు


ఫోనుకే గుచ్చాడు మా సారు
థంబ్‌లేయించాడు మా సారు

యా.. థంబ్‌ పడలేదని చిరాకుపడ్డాడు

మీ అమ్మను పిలవమని వెళ్లతోలాడు

మాయమ్మ పనికెళ్లే.. నేనేమి చెప్పాలి

బిక్కమొగం వేశాను.. బిక్కుబిక్కుమంటూ

చిర్రుబుర్రులాడాడు మాసారు..

నెత్తి గోక్కుంటూ

మధ్యాహ్నం అయింది

అన్నం బెల్లు మోగింది


మళ్లా సెల్లు తీశాడు మా సారు

టిక్కుటిక్కు నొక్కాడు మా సారు

ఫొటోలు తీశాడు మా సారు


క్లాసులోకి వచ్చాడు మా సారు

మళ్లీ సెల్లు ఫోను టింగుమంది

ఉలిక్కిపడ్డాడు మా సారు


అర్జంటు మెసేజులు

ఆన్‌లైన్‌ చెయ్యాలి

అడ్మిషన్లు ఎక్కించాలి

యూడైస్‌లు కొట్టాలి

నాడు-నేడు నెట్టాలి
అంతులేని కథ మా సారు
నడిసముద్రం ఈదుతూ మా సారు
ఏమైపోతడో మా సారు..!

అంటూ సాగుతున్న ఈ పేర‌డీ గీతం వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్ గా మారింది. మ‌రి ఇప్ప‌టికైనా ఉపాధ్యాయుల క‌ష్టాలను ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుందో, లేదో వేచిచూడాల్సిందే!