Begin typing your search above and press return to search.

బూతులు తిడుతుందంటూ చిలుకను లోపలేశారు

By:  Tupaki Desk   |   19 Aug 2015 4:43 AM GMT
బూతులు తిడుతుందంటూ చిలుకను లోపలేశారు
X
మనిషి అంటే నోరుంది.. దాంతో ఏదైనా వాగేసి ఇబ్బంది పెట్టేస్తాడనుకోవచ్చు. కానీ.. ఒక చిలుక నోటి నుంచి వచ్చే బూతుల్ని భరించలేని ఒకరిచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు దాన్ని పట్టుకొని లాకప్ లో పడేయటం విశేషం. ఈ విచిత్రమైన ఉదంతం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజారా ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ ప్రాంతానికి చెందిన జానాబాయ్.. ఆమె సవితి కుమారుడు సురేష్ ల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. దీంతో.. తాను కనిపించిన ప్రతిసారీ అసభ్యకరంగా.. అత్యంత దారుణమైన బూతులు మాట్లాడేలా చిలుకకు ట్రైనింగ్ ఇచ్చి.. తనను తిట్టిస్తున్నారంటూ జానాబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం విన్న పోలీసులు తొలుత ఆశ్చర్యపోయి.. సరేనని ఊరుకున్నారు. కానీ.. ఆమె తన పరిస్థితి గురించి దయనీయంగా చెప్పుకోవటంతో పోలీసులు.. సదరు గ్రామానికి వెళ్లి.. అక్కడి గ్రామస్తుల్ని వాకబు చేశారు.

జానాబాయి కనిపించిన ప్రతిసారీ చిలుక తిట్టేదని కొందరు గ్రామస్తులు చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో.. చిలుకపై ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేయాలో అర్థంకాని పోలీసులు మొదల దాన్ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పోలీసుల అదుపులో ఉన్నంత సేపు సదరు చిలుక ఎంతో బుద్దిమంతురాలిగా.. ఒక్క బూతు కూడా తిట్టకుండా కామ్ గా ఉందట. చిలుక బూతు పురాణానికి సంబంధించి తమకు లభించిన ఆధారాలకు.. దాని తీరుకు ఏ మాత్రం సంబంధం లేకపోవటంతో తల పట్టుకోవటం పోలీసుల వంతు అవుతుందని చెబుతున్నారు.