Begin typing your search above and press return to search.

యువరాజు అడ్డాలో ఓటే వేయలేదట

By:  Tupaki Desk   |   28 Feb 2017 9:12 AM GMT
యువరాజు అడ్డాలో ఓటే వేయలేదట
X
తన మాటలతో.. చేతలతో తరచూ భంగపడే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి ఇప్పుడు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి యూపీలో వివిధ దశల్లో పోలింగ్ సాగుతోంది. తాజాగా రాహుల్ ప్రాతినిధ్యం వహించే అమేథీలో ఎన్నికలు జరిగాయి. అయితే.. తమకున్న సమస్యల్ని తీర్చే విషయంలో పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా అమేథీలోని పర్సౌలీ గ్రామం యావత్తు ఓటు వేయకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గాంధీ కుటుంబానికి రక్షగా నిలిచే అమేథీ నియోకవర్గ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ గ్రామంలో మొత్తం 649 మంది ఓటర్లు ఉంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటింగ్ లోకి పాల్గొనకపోవటం గమనార్హం. ఇంతకీ ఈ పర్సౌలీ గ్రామం అమేథీకి చాలా దూరంలో ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. అమేథీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పర్సౌలీ గ్రామంలో రోడ్డును అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం వేశారని.. ఆ తర్వాత నుంచి పట్టించుకోవటమే మానేశారు.

పలుమార్లు.. తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించుకున్నా పట్టించుకున్నది లేదు. దీంతో.. వారంతా కలిసి ఓటింగ్ కుదూరంగా ఉండాలని నిర్ణయించారు. గాంధీలకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఓటింగ్ ను బహిష్కరించటం ఒక ఎత్తు అయితే.. దేశాన్నే మార్చేస్తానని చెప్పే రాహుల్ లాంటి పెద్ద మనిషి ప్రాతినిధ్యం వహించే చోట దశాబ్దాల నాటి రోడ్డును బాగు చేయించేందుకు ఇన్నేళ్లు పట్టాల్సి రావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. రాహుల్ తీరుతో.. కంచుకోటకు బీటలు పడనున్నాయా? అన్నది సందేహంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/