Begin typing your search above and press return to search.

ఓట‌రు మెడ‌పై క‌త్తి.. బాబు న‌మూనా ఇదేనా!

By:  Tupaki Desk   |   30 Aug 2017 8:32 AM GMT
ఓట‌రు మెడ‌పై క‌త్తి.. బాబు న‌మూనా ఇదేనా!
X
హోరా హోరీగా సాగిన నంద్యాల పోరు.. ఫ‌లితం వెల్ల‌డైంది. టీడీపీ ప్ర‌లోభాల‌కు - అభివృద్ధి పేరుతో బెదిరించ‌డాల‌కు - పింఛ‌న్లు ఆపేస్తాం - రేష‌న్ కార్డులు తీసేస్తాం - రోడ్లు నిలిపేస్తాం.. వంటి అనేక బెదిరింపుల‌కు ప‌రాకాష్ట‌గా ఫ‌లితం టీడీపీని వ‌రించిందన్న వాద‌న వినిపిస్తోంది. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేని విష‌యం. ఇంత‌గా టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు - నేత‌లు - ఆఖ‌రుకు చంద్ర‌బాబు సైతం ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసినా.. జ‌నాలు మాత్రం వైసీపీకి అండ‌గా నిలిచిన విష‌యమూ కాద‌న‌లేనిదే. దాదాపు 70 వేల మంది ఓట‌ర్లు.. వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. దీనిని మ‌రిచిన సీఎం చంద్ర‌బాబు.. నంద్యాల గెలుపును నిఘంటువుగా తీసుకోవాల‌ని త‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపునివ్వ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఇదే విష‌యంపై మాట్లాడిన వైసీపీ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి పార్థ‌సార‌థి.. సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికను నమునాగా తీసుకుని ముందుకెళ్లాలని చంద్ర‌బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నంద్యాల కోసం టీడీపీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టి.. పైగా ఇదో ప్ర‌జాస్వామ్య విజ‌యం అని చెప్పుకోవడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. ఓటరు మెడపై కత్తిపెట్టి - ప్రలోభపెట్టి గెలవడం నమూనా ఎలా అవుతుందని ఆయ‌న నిల‌దీశారు. ఇదే ఫార్ములాతో 2019 ఎన్నిక‌ల‌కూ వెళ్లాల‌ని చెప్ప‌డం అంటే.. ఓట‌ర్ల‌ను మ‌రింతగా ప్ర‌లోభ పెట్ట‌డ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా పార్థ‌సార‌థి.. బాబుకు కొన్ని ప్రశ్న‌లు సంధించారు..

+ 175 నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికలలో రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టడమేనా మీ నంద్యాల నమూనా?

+ పెన్షన్లు - రేషన్ రద్దు చేస్తాం మీపై కేసులు పెడ‌తాం అని బెదిరించ‌డ‌మేనా మీ ఎత్తుగ‌డ‌?

+ ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ రూ.6 వేలు పెట్టి వారిని ప్ర‌లోభ పెట్ట‌డ‌మేనా మీ అభివృద్ధి?

+ పాల‌న‌ను గాలికి వ‌దిలేసి మంత్రుల‌ను - ఎమ్మెల్యేల‌ను ఇంటింటికీ తిప్ప‌డ‌మేనా మీ అజెండా?

+ ఈ ప‌నికిమాలిన అజెండాతోనే మీరు 2019లోనూ గెల‌వాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారా?

+ టీడీపీ నేతలకు నిజంగా దమ్ము - ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలకు సిద్ధంకాగ‌ల‌రా?

అని పార్థ‌సార‌థి ప్ర‌శ్నించారు. మ‌రి దీనికి బాబు టీం రియాక్ట్ అవుతుందో చూడాలి.