Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో మరీ ఇంత బరితెగింపా ?

By:  Tupaki Desk   |   29 Oct 2021 12:30 PM GMT
హుజూరాబాద్ లో మరీ ఇంత బరితెగింపా ?
X
‘ఎన్నికల్లో డబ్బులు ఇవ్వటం ఎంత నేరమో తీసుకోవటం కూడా అంతే నేరం’ ఇది కేంద్ర ఎన్నికల కమీషన్ ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా చెప్పేమాట. కానీ క్షేత్రస్ధాయిలో జరగుతున్నదేమిటి ? పార్టీలు గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులు వెదచల్లటం. అంటే కేంద్ర ఎన్నికల కమీషన్ చెబుతున్న మాటలకు, వాస్తవంగా జరుగుతున్న వ్యవహారాలకు ఏమాత్రం పొంతన లేదని తేలిపోయింది. నిజానికి ఓటుకు ఇంతాని డబ్బు ముట్టచెప్పటం కొత్తేమీకాదు. కానీ వ్యవహారం అంతా గుట్టుగా జరిగిపోతుంది.

ఎక్కడైనా డబ్బుల పంపిణీలో గోల జరిగినా వీలైనంతలో అగ్రనేతలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దు మణిగేట్లు చూస్తారు. కానీ 30వ తేదీన ఉపఎన్నిక జరగబోతున్న హుజూరాబాద్ లో మాత్రం అంతా బరితెగిందే. అంతా ఓపెన్ గానే జరుగుతోంది. ఇంకా డబ్బులు పంపిణీ చేస్తున్నవారు కాస్త గుట్టు పాటిస్తున్నారు. అయితే డబ్బులు తీసుకునే జనాలు మాత్రం పూర్తిగా బరితెగించేశార.

తమ పక్కనవాళ్ళకు డబ్బులు పంచిన పార్టీ తమకు ఎందుకు ఇవ్వటం లేదని బహిరంగంగానే నిలదీయటం సంచలనంగా మారింది. మిగిలిన వాళ్ళకు ఎంతడబ్బు ఇచ్చారో తమకు కూడా అంతే డబ్బు ఇస్తేకానీ తాము ఓటింగ్ కు వచ్చేది లేదని తెగేసి మరీ పార్టీలను బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం ఓటర్లు బహిరంగంగానే పార్టీ నేతలను హెచ్చరించటం కలకలం రేపుతోంది. కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నేతల మీద మరికొన్ని గ్రామాల్లో బీజేపీ మీద ఓటర్లు టీవీ ఛానళ్ళ ముందే డబ్బుల కోసం వార్నింగులు ఇవ్వటం గమనార్హం.

హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఓటుకు రు. 6-10 వేల మధ్యలో పార్టీలు ఇస్తున్నాయి. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న గ్రామస్తులే ఈ విషయాన్ని టీవీల ముందు చెబుతున్నారు. ఇప్పటికే ప్రలోభాల పేరిట ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు రు. 150 కోట్ల దాకా పంపిణీ చేసుంటాయనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. నియోజకవర్గంలోని సుమారు 2.13 లక్షల ఓట్లలో ఓటుకు సగటున రు. 10 వేలు పంచటమంటే మామూలు విషయంకాదు. నిజానికి మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఓటర్లలో డబ్బులు తీసుకునే వారిసంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే డబ్బుల పంపిణీలో వారు వీరనే తేడా లేకుండా ఓటర్ల సమ్మతితో సంబంధం లేకుండా డబ్బులిచ్చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా ఉంటుందనేందుకు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికే తాజా ఉదాహరణ. వందల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఓటర్లకు పంపిణీ చేయటం ఒకఎత్తైతే గెలుపుపై వందల కోట్ల రూపాయల ఆన్ లైన్ బెట్టింగులు జరుగుతుండటం మరో ఎత్తు. మొత్తానికి తమకు డబ్బులు ఎందుకివ్వరని పార్టీలను జనాలు టీవీల్లో డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.