Begin typing your search above and press return to search.

విభజనతో గాంధీ.. నెహ్రూ పేద్ద తప్పే చేశారా?

By:  Tupaki Desk   |   1 Sep 2016 5:34 AM GMT
విభజనతో గాంధీ.. నెహ్రూ పేద్ద తప్పే చేశారా?
X
ఎప్పుడూ లేని విధంగా దేశ విభజన మీద చర్చ ఇప్పుడు జరుగుతుంది. సంఘ్ పరివార్.. బీజేపీ నేతలు పలువురి నోటి నుంచి దేశ విభజనను తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తుంటారు. దేశాన్ని విభజించి పెద్ద తప్పు చేశారంటూ జాతిపిత గాంధీ.. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రును తిట్టి పోసేవారు చాలామందే కనిపిస్తారు. అయితే.. దేశ విభజన మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పు అంటూ ఒక కొత్త వాయిస్ తెర మీదకు వచ్చింది.

విన్నంతనే ఆశ్చర్యం కలిగించే వ్యాఖ్య అంత పెద్ద మనిషి నోటి నుంచా? అన్న ఆశ్చర్యం కలిగేలా తాజా వ్యాఖ్య ఉండటం గమనార్హం. సంఘ్ పరివార్.. బీజేపీ నేతలకు ఏమాత్రం తీసిపోని విధంగా విభజనను తీవ్రంగా తప్పుపట్టిన జాబితాలో తాజాగా చేరనున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ మౌలానా సిద్ధిఖీ మాట్లాడుతూ.. దేశ విభజన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టటం గమనార్హం.

‘‘దేశ విభజన మన పూర్వీకులు చేసిన అతి పెద్ద పొరపాటు. వాళ్లు దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. ఇందులో ఒక భాగం పాకిస్తాన్. అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల కారణంగా ఇప్పుడు దానిని మనం ‘‘పాపిస్తాన్’’ గా పిలుస్తున్నాం. ఆ పొరపాటును సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మేం ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం. దేశం కోసం సేవ చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

విభజన నిర్ణయం పూర్వీకులు చేసిన అతి పెద్ద పొరపాటుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షులు వ్యాఖ్యానించటం ఒక ఎత్తు అయితే.. హింసాత్మక సంఘటనల కారణంగా పాపిస్తాన్ గా మనం పిలుస్తున్నామని వ్యాఖ్యానించటమే కాదు.. ఆ పొరపాటును సరిదిద్దాల్సిన అవసరం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కీలకమైనవిగా చెప్పాలి. తప్పును ‘సరి’ దిద్దటం అనే మాటకు మరింత వివరణను మౌలానా సిద్దిఖీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.