Begin typing your search above and press return to search.

దేవినేని ఉమాకు బొమ్మ చూపిస్తున్న కార్య‌క‌ర్త‌లు!

By:  Tupaki Desk   |   2 Dec 2022 2:30 AM GMT
దేవినేని ఉమాకు బొమ్మ చూపిస్తున్న కార్య‌క‌ర్త‌లు!
X
మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ఇటు అధికార వైసీపీ ఎమ్మెల్యే, అటు ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావులు ఇద్ద‌రూ కూడా ఇంటిపోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ చేతిలో ఓట‌మిపాలైన మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ సారి మైల‌వ‌రంలో ఎలాగైనా విజ‌య‌ఢంకా మోగించాల‌ని పావులు క‌దుపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ‌ప్ర‌సాద్‌పై నిత్యం ఏదో ఒక ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌కీయాన్ని హీట్ హెక్కిస్తున్నారు. వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ కూడా అదే స్థాయిలో దేవినేని ఉమా ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా చేస్తున్నారు. దాంతో కృష్ణా జిల్లాల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా టీడీపీ నేత దేవినేని ఉమా త‌న సొంత పార్టీ నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీలో ఆయ‌న బ‌ద్ద వ్య‌తిరేకి బొమ్మ‌సాని సుబ్బారావు ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో చుక్క‌లు చూపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌దే సీటు అంటూ ఆయ‌న నియోక‌వ‌ర్గ‌మంతా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న అభిమానులు బొమ్మ‌సాని సుబ్బారావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. బొమ్మ‌సాని సుబ్బారావు కూడా దేవినేని ఉమాతో సంబంధం లేకుండా వ‌రుస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉమాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. దేవినేని ఉమా వ‌ర్గానికి బొమ్మ‌సాని వ‌ర్గానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంటుంది. ఇప్ప‌టికీ కూడా బొమ్మ‌సాని వ‌ర్గం దేవినేని ఉమా వ‌ర్గంపై ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ సారి ఎన్నిక‌ల్లో టికెట్ కోసం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడితో తాడోపేడో తేల్చుకోవాల‌నే దిశ‌గా బొమ్మ‌సాని సుబ్బారావు, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం ప్ర‌య‌త్నిస్తోంది.

దేవినేని ఉమాకు చెక్‌పెట్ట‌డానికి బొమ్మ‌సాని వ‌ర్గం లోకల్ నినాదాన్ని కూడా తెర‌మీద‌కు తీసుకొస్తోంది. దాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా తీసుకెళ్ల‌డానికి ఆయ‌న వ‌ర్గీయులు వ్యూహాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గంలో పావులు క‌దుపుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో స్థానికుడికే మైల‌వ‌రం టీడీపీ టికెట్టు ఇవ్వాల‌ని బొమ్మ‌సాని వ‌ర్గం డిమాండు చేస్తోంది. అలా డిమాండుతో స‌రిపెట్టుకోకుండా నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కి ఈ డిమాండును బ‌లంగా తీసుకెళుతున్నారు. దేవినేని ఉమా తీరు వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ శ్రేణుల‌ను బొమ్మ‌సాని వ‌ర్గం ఏకం చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు దేవినేని ఉమా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచీ గెలుపొందారు. చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ఆయ‌న జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. అయితే దేవినేని ఉమా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సామాన్య కార్య‌క‌ర్త నుంచీ పార్టీలో ఆయ‌న గెలుపుకోసం ఎంతోమంది కృష్టి చేశారు. అయితే మంత్రి అయ్యాక ఆయ‌న ఎవ‌ర్నీ ప‌ట్టించుకోలేదు. దాంతో నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని ఉమాప‌ట్ల విప‌క్షంలోనే కాదు టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌దనే నినాదాలు వ‌చ్చినా అప్ప‌ట్లో అధినాయ‌క‌త్వం ప‌ట్టించుకోక దేవినేని ఉమాపై మొగ్గుచూపింది. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హావాలో టీడీపీతో పాటు దేవినేని ఉమా కూడా ఘోరంగా ఓటమిపాల‌య్యారు. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ దేవినేని ఉమాపై విజ‌యం సాధించారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో దేవినేని ఉమా ఓట‌మి రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను విస్తుగొలిపింది. టీడీపీలోని టాప్ నాయ‌క‌త్వం జాబితాలో ఒక వెలుగు వెలిగిన దేవినేని ఉమా త‌న‌ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో అంత స్థాయిలో ఉన్న అసంతృప్తిని ప‌సిగ‌ట్ట‌లేక‌పోవడం టీడీపీ అధిష్టానాన్ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌ళ్లీ తాను విజ‌యం సాధించాల‌ని దేవినేని ఉమా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు పార్టీలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి బొమ్మ‌సాని సుబ్బారావు గండిగొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టికెట్ రాకుండా దేవినేని ఉమాను నిలువ‌రించ‌డానికి ఆయ‌న శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. స్థానికుడికే టీడీపీ టికెట్ ఇవ్వాల‌నే స‌రికొత్త డిమాండును పార్టీ శ్రేణుల్లోకి బ‌లంగా తీసుకుపోవ‌డం ద్వారా పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో దేవినేని ఉమాకు మైల‌వ‌రం టికెట్‌పై ఆ పార్టీ వ‌ర్గాల్లోనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి దేవినేని ఉమాను విజ‌య‌వాడ సిటీ నుంచీ లేదా గుడివాడ నుంచీ కూడా తెలుగుదేశం అధిష్టానం బ‌రిలోకి దించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దేవినేని ఉమా మాత్రం నియోజ‌క‌వ‌ర్గం మార‌డానికి సుతారాము ఇష్ట‌ప‌డ‌టం లేదని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మైల‌వ‌రం నుంచే పోటీ చేస్తార‌ని ఆయ‌న వ‌ర్గీయులు గంటాప‌థంగా చెబుతున్నారు.

మైల‌వ‌రం టీడీపీలో చివ‌ర‌కు ఎరిది పైచేయి అవుతుంది? ఉమాదా బొమ్మ‌సాని సుబ్బారావుదా? అదేది అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉత్కంఠ రేపుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.