Begin typing your search above and press return to search.

చిన్నమ్మా.. సీఎం పదవి చేపట్టండి

By:  Tupaki Desk   |   19 Dec 2016 6:17 AM GMT
చిన్నమ్మా.. సీఎం పదవి చేపట్టండి
X
విప్ల‌వ‌నాయ‌కి జ‌య‌లలిత మ‌ర‌ణం త‌ర్వాత తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జయలలిత మరణానంతరం ఆమె సన్నిహితురాలు శశికళ త‌న ప‌ట్టును పెంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఖ‌రారు అయ్యారు. అయితే దానితో పాటు ముఖ్యమంత్రిగా రెండు బాధ్యతలు చేపట్టాలని పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ విభాగమైన జయలలిత పెరవై సమావేశమై రెండు పదవులూ ఆమే చేపట్టాలని తీర్మానించింది. సమాచార మంత్రి కదంబూర్ రాజు, దేవాదాయశాఖ మంత్రి సెవూర్ ఎస్ రామచంద్రన్, గృహనిర్మాణశాఖ మంత్రి ఉడుమలై కే రాధాకృష్ణన్ తదితరులు ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు.

ఇదిలాఉండ‌గా దివంగత తమిళనాడు సీఎం జయలలిత పేరును ఓ పసిపాపకు శశికళ నాటరాజన్ పెట్టారు. తమిళనాడులోని తెని జిల్లాకు చెందిన సెంథిల్‌కుమార్ అన్నాడీఎంకే కార్యకర్త. ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల సెంథిల్‌కుమార్ గాయత్రి దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఆ పాపను పోయెస్ గార్డెన్‌లో ఉన్న శశికళకు వారు చూపించగా జయ జ్ఞాపకార్థం జయలలిత అనే పేరును శశికళ పెట్టారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఢిల్లీలో సమావేశం కానున్న సంద‌ర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెట్ట‌నున్నార‌ని స‌మాచారం. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారని తెలుస్తోంది. జయలలిత నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్మానం చేసిన సంగ‌తి తెలిసిందే. వార్దా తుఫాను నేపథ్యంలో తుఫాను మిగిల్చిన నష్టాల నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి రూ.1000 కోట్లు జాతీయ విపత్తుల నిధి నుంచి విడుదల చేయాలని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తుఫాను తాకిడికి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది చెట్లు నేలకూలడంతోపాటు విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తుఫాను నష్టాలను ప్రధానికి వివరించి, వివిధ అంశాలపై ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వినతిపత్రం అందజేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/