Begin typing your search above and press return to search.

చినబాబును దెబ్బేయటానికి సొంత పార్టీలోనే కుట్ర?

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
చినబాబును దెబ్బేయటానికి సొంత పార్టీలోనే కుట్ర?
X
కొంతమంది నేతలకు కొన్ని ఇమేజ్ లు వచ్చేస్తుంటాయి. ఒకసారి ఫిక్సు అయ్యాక.. ఆ ముద్ర నుంచి బయటకు వచ్చి మరో ఇమేజ్ లోకి వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. రాజకీయాల్లో ఇది మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మొదట్లోనే అతడిని టార్గెట్ చేసిన రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బాడే షేమింగ్ చేసేవారు. ఇలాంటివి మరే నేత విషయంలో జరిగితే రార్దాంతం చేసేవారు. కానీ.. బాబు పార్టీ వారు మాత్రం ఈ ఇష్యూను అంత సీరియస్ గా తీసుకున్నది లేదు.

అనంతరం లోకేశ్ మాటను.. అతడి ప్రసంగంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ అతడ్ని చులకన చేసే ప్రయత్నం చేసేవారు. తన లోపాన్ని గుర్తించి దాన్ని అధిగమించే విషయంలో కాస్త ఆలస్యంగా రియాక్టు అయ్యారు లోకేశ్. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలతో పోలిస్తే నారా లోకేశ్ మాటలు చాలా వరకు బెటర్ గా కనిపిస్తాయి. కానీ.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పుణ్యమా అని.. జగన్ కు పెద్దగా డ్యామేజ్ జరగలేదు కానీ.. లోకేశ్ కు మాత్రం పెద్ద ఎదురుదెబ్బలే తగిలాయి. ఇలాంటివేళ.. తనను తాను పూర్తిగా మార్చుకునేందుకు మేకోవర్ కార్యక్రమాన్ని చేపట్టిన చినబాబు.. అందుకు తగ్గట్లే తనను తాను పూర్తిగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యారు.

గతానికి వర్తమానానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉండటమే కాదు.. గతంలో కనిపించని దూకుడుతనం ఈ మధ్యన ఎక్కువైంది. అంతేకాదు.. ఏదైనా ఇష్యూల విషయంలో వెనువెంటనే స్పందించటమే కాదు.. వినూత్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తానో సవాలుగా మారారని చెప్పాలి. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా పోరాడుతున్న లోకేశ్.. గతంతో పోల్చలేనంతగా కష్టపడుతున్న పరిస్థితి. దీంతో.. గతంలో టీడీపీ నెంబరు 2 స్థానంలో లోకేశ్ పేరు.. చంద్రబాబు తనయుడిగా వినిపిస్తే.. ఇప్పుడు మాత్రం తన సొంత శక్తి సామర్థ్యాలతో గెలుచుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పాలి.

అయితే.. ఈ తీరును టీడీపీలోని కొందరికి మింగుడుపడటం లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ అనుమానానికి బలం చేకూరేలా తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం పార్టీలో కలకలాన్ని రేపుతోంది. పదో తరగతి విద్యార్థులు పరీక్షలో భారీగా ఫెయిల్ అయిన నేపథ్యంలో వారికి జరిగిన అన్యాయంపై లోకేశ్ బలమైన గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇలాంటి మీటింగ్ లోకి జొరపడిన వైసీపీ నేతలు.. కార్యక్రమాన్ని రసాభాస చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని చేపట్టారు. నిజానికి జూమ్ మీటింగ్ లో ఎవరు పడితే వారు ఎంట్రీ కాలేరన్న సంగతి తెలిసిందే. యూజర్ నేమ్.. పాస్ వర్డ్ తోనే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి.. లోకేశ్ నిర్వహించిన ఈ జూమ్ మీటింగ్ లోకి వైసీపీ నేతలు ఎలా ఎంట్రీ ఇచ్చారన్న విషయంపై లోతుగా చెక్ చేస్తే.. షాకింగ్ అంశాలు బయటకు వచ్చాయి. క్రిష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత యూజర్ ఐడీ.. పాస్ వర్డ్ సంపాదించి.. వైసీపీ నేతలకు అందజేయటంతో ఈ లొల్లంతా జరిగిందన్న విషయాన్ని గుర్తించారు.

ఇదంతా చూస్తే.. టీడీపీ నేతలు కొందరు లోకేశ్ ను దెబ్బేయటానికి వీలుగా ప్రత్యర్థులతో చేతులు కలిపారన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమవుతుందని చెప్పాలి. ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇంటి దొంగల భరతం పట్టటంతో పాటు.. లోకేశ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వీలుగా చేపట్టే కార్యక్రమాల్ని ముందస్తుగా పసిగట్టేందుకు వీలుగా కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.