Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో టికెట్ల కోసం ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   18 July 2018 12:41 PM GMT
టీ కాంగ్రెస్ లో టికెట్ల కోసం ర‌చ్చ‌!
X
2019లో జ‌ర‌గ‌నున్న‌ సార్వత్రిక ఎన్నికల నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. త‌మ బ‌లాబ‌లాలు, పార్టీ అభ్య‌ర్థుల ఎంపికపై అన్ని పార్టీలు క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు గ‌ట్టిపోటీ ఇస్తుంద‌నుకుంటోన్న కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల గొడ‌వ మొదలైంది. సాక్ష్యాత్తూ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఎదుట టికెట్ ఆశావ‌హులు నానా ర‌చ్చ చేశారు. త‌మ‌కు ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కావాంలంటూ డిమాండ్లు మొద‌లెట్టారు. అయితే, రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఇప్పుడే ఖరారు చేయడం లేదని బోస్ రాజు స్పష్టం చేయ‌డంతో ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింది. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందించిన వారికే టికెట్లు దక్కుతాయని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డంతో ఆ నేత‌లు సైలెంట్ అయ్యారు. మంగళవారం నాడు ఇందిరాభవన్ లో జిరిగిన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం సంద‌ర్భంగా ఈ టికెట్ల వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. ఆ స‌మావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ చార్జి డీకే అరుణ - టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి - మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి - సర్వే సత్యనారాయణ - గడ్డం ప్రసాద్‌ కుమార్ - ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి - మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్ - కూన శ్రీశైలంగౌడ్‌ తదితరులు హాజర‌య్యారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డైనమిక్‌ లీడర్ అని, ఆమెకు చేవెళ్ల లోక్ స‌భ టికెట్ ఇవ్వాల‌ని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అభిప్రాయ‌ప‌డ‌డంతో గొడ‌వ మొద‌లైంది. ఆ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి - ఆమె అనుచ‌రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహేశ్వరం అసెంబ్లీ టికెట్ ఆశిస్తోన్న స‌బితాకు ఈ వ్యాఖ్య‌లు రుచించ‌లేదు. మహేశ్వరం నుంచే స‌బిత పోటీ చేయాలని కొంత‌మంది కార్యకర్తలు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలని సబితా అన్నారు. కేసీఆర్ త‌న కుటుంబాన్ని మాత్రమే బంగారంగా తయారు చేశారని ఎద్దేవా చేశారు. మ‌రోవైపు, సర్వే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కూడా మండిప‌డ్డారు. పార్టీలో గ్రూపులు పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్క‌ద‌న్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో, వచ్చే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పుడే ఖరారు చేయడం లేదని బోస్ స్పష్టం చేశారు. రాబోయే వందరోజుల్లో బాగా పనిచేసే నేతలకు టికెట్టు కేటాయించే అవకాశముందన్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాట‌లు త‌గ‌వ‌ని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని చెప్పారు.