Begin typing your search above and press return to search.

దేశంలోనే నంబర్ 7గా దయాకర్

By:  Tupaki Desk   |   24 Nov 2015 11:25 AM GMT
దేశంలోనే నంబర్ 7గా దయాకర్
X
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ భారీ మెజారిటీతో ఎన్నికైన విషయం తెలిసిందే. దేశంలో ఇంతవరకు సాధించిన అత్యధిక మెజారిటీలను పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఏడో స్థానంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వచ్చిన అత్యధిక మెజారిటీల వివరాలు పరిశీలిస్తే తెలంగాణకు చెందిన ఇద్దరికి ఈ జాబితాలో స్థానం దక్కింది. ఒకరు దయాకర్ కాగా రెండో వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కావడం గొప్ప విషయం. వీరుకాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ అధినేత జగన్ కూడా అయిదో స్థానంలో ఉన్నారు.

- మహారాష్ట్రలోని బీడ్‌ లోక్సభ స్థానానికి 2014లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఎన్నికైన ప్రీతమ్‌ ముండే అత్యధిక మెజారిటీల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. 32 ఏళ్ల ముండే మహారాష్ట్రకు చెందిన నేత గోపీనాథ్ ముండే కుమార్తె. 2014 ఎన్నికల్లో గెలిచిన గోపీనాథ్ ముండే మృతిచెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తెగా ప్రీతమ రంగంలోకి దిగి ఏకంగా 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇది దేశంలోనే అత్యధిక మెజారిటీ.

- పశ్చిమబెంగాల్ లో ఆరామ్‌ గఢ్‌ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్‌ బసు 5 లక్షల 92 వేల 502 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు.

- నంద్యాల నియోజక వర్గంనుంచి పోటీ చేసిన పి.వి. నరసింహారావు 5 లక్షల 80 వేల ఓట్ల మెజారిటీ సాధించి తృతీయ స్థానంలో ఉన్నారు.

- వడోదర నుంచి పోటీ చేసిన నరేంద్రమోడీ 5 లక్షల 70 వేల 128 ఓట్ల మెజారిటీతో నాలుగో స్థానంలో నిలిచారు.

- కడపనుంచి పోటీ చేసిన వైఎస్‌ జగన్‌ 5 లక్షల 45 వేల మెజారిటీతో ఐదవ స్థానంలో ఉన్నారు.

- హాజీపూర్‌ నియోజక వర్గంనుంచి పోటీ చేసిన రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ 5 లక్షల 4 వేల ఓట్లతో ఆరవ స్థానంలోనూ నిలిచారు.

- తాజాగా, వరంగల్‌ లొ లోక్‌సభ నియోజకవర్గంనుంచి టిఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పసునూరి దయాకర్‌ 4, 59 వేల 92 ఓట్ల మెజారిటీ సాధించి ఏడవ స్థానంలో నిలిచారు.