Begin typing your search above and press return to search.

ముఖేష్ అంబానీ త‌ర్వాత రాందేవ్ బాబాకే ఆ ఘ‌న‌త‌

By:  Tupaki Desk   |   28 May 2018 2:05 PM GMT
ముఖేష్ అంబానీ త‌ర్వాత రాందేవ్ బాబాకే ఆ ఘ‌న‌త‌
X
దేశ టెలీకాం చ‌రిత్ర‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. జియో పేరుతో రిల‌య‌న్స్ దిగ్గ‌జం ముఖేష్ అంబానీ సృష్టించిన సంచ‌ల‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. టెలికాం ప‌రిశ్ర‌మ ద‌శ‌ - దిశ‌ల‌ను మార్చేసిన జియో అనేక సంస్థ‌ల‌ను మ‌ట్టిక‌రిపించింది. అలాంటి మ‌రో సంచ‌ల‌నాన్ని తాజాగా దేశీయ మంత్రం జ‌పించే యోగా గురువు రాందేవ్ బాబా ఆవిష్క‌రించారు. అతి తక్కువ కాలంలో 50 నుంచి ఏకంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టి పతంజలి ఆయుర్వేద్ సంస్థ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తమ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారుల ఆదరణను పొందింది. ఇలా కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్‌ లో విజయవంతమైన పతంజలి.. టెలికాం సెక్టార్‌ లో అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫ‌ర్ల‌న్నీ సంచ‌ల‌న రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాందేవ్ బాబా సంస్థ‌ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ ఎన్ ఎల్)తో ఒప్పందం చేసుకొని స్వదేశీ-సమ్‌ రాధి సిమ్‌ కార్డులను మార్కెట్లోకి విడుదల చేయనుంది. పతంజలి సంస్థ అందించే సిమ్‌ కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్‌ తో పాటు 100ఎస్సెమ్మెస్‌ లు పంపుకునే వీలుందని పేర్కొంది.ఇది మాత్రమే కాదు రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆరోగ్య - ప్రమాద - జీవిత బీమాను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పింది. మొదట్లో పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు - అధికారులు మాత్రమే సిమ్‌ కార్డు ప్రయోజనాలు పొందనున్నట్లు వెల్లడించింది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కార్డు ఉపయోగించి వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా బీఎస్ ఎన్ ఎల్‌ కు 5లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సమ్‌ రాధి కార్డును పొందవచ్చని యోగా గురువు - పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. బీఎస్ ఎన్ ఎల్ స్వదేశీ సంస్థ అని.. పతంజలి - బీఎస్ ఎన్ ఎల్ సంస్థ రెండింటి ఉద్దేశం దేశ సంక్షేమమేనని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలిపారు.