Begin typing your search above and press return to search.

మతం మారిపోతాం అంటున్న అగ్రకులం

By:  Tupaki Desk   |   27 Oct 2015 4:29 AM GMT
మతం మారిపోతాం అంటున్న అగ్రకులం
X
రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయాలని, లేదా తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంచలనాలు కల్గిస్తున్న గుజరాత్ పటేల్ సామాజిక వర్గం సరికొత్త అస్త్రం సంధించింది. రాష్ట్రంలో తమ వర్గం వారికీ తక్షణం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తాము మతం మార్చుకునేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయబోమని సూరత్‌ కు చెందిన 500 కుటుంబాలకు చెందిన ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు ఆ సమితి ప్రతినిధులు స్పష్టంచేశారు. గుజరాత్ ప్రభుత్వానికి పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి చేసిన హెచ్చరిక గుజరాత్ సమాజంలో పెను ప్రకంపనలను కలిగించింది.

ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అతి తక్కువ కాలంలో పటేల్ సామాజిక వర్గాన్నంతటినీ ఒకతాటిపైకి తెచ్చిన యువకుడు హార్దిక్ పటేల్‌ ను కట్టడి చేయడమలో గుజరాత్ ప్రభుత్వం విజయం సాధించడమే కాకుండా ఉద్యమాన్ని కూడా నీరుగార్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. దీంతో ప్రభుత్వమే ఊహించని విధంగా హార్దిక్ అనుచరులు కొత్త వాదనను ప్రభుత్వం ముందు పెట్టారు. ‘మా డిమాండ్ మేరకు ఓబీసీ రిజర్వేషన్లను అందించండి. లేకపోతే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడానికి కూడా మేం సిద్ధమే’ అంటూ వారు ప్రకటించారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ నెట్‌ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు జాతీయ పతాకాన్ని అవమానించారని పేర్కొంటూ దేశ ద్రోహం కింద అరెస్టు చేసిన హార్దిక్ పటేల్‌కు మరో వారం రోజుల పాటు పోలీసు కస్టడీని అహ్మదాబాద్ కోర్టు పొడిగించింది. హర్దిక్ పటేల్‌ ను 14 రోజుల పాటు కస్టడీకి కావాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్.జే.బ్రహ్మభట్ వారం రోజుల పాటు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రిజర్వేషన్ ఉంటే తప్ప ఉద్యోగాలు దొరికే పరిస్థితులు లేవని తేలిపోవడంతో దేశంలో అగ్రవర్ణాలకు చెందిన యువత తమకూ రిజర్వేషన్లు కావాలంటూ చేస్తున్న నిరసనలకు తాజా మిలిటెంట్ రూపం హార్దిక్ పటేల్. ఓట్ల రాజకీయాలు తప్ప మరేమీ పట్టించుకోని ప్రభుత్వాలకు ఇది పరిష్కరించలేని సమస్యగా మిగిలినందుకు ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు.