Begin typing your search above and press return to search.

నేత‌ల మ‌ధ్య పోరు.. రెడ్డి శాంతికి క‌లిసి వ‌స్తోందా?

By:  Tupaki Desk   |   29 Nov 2020 1:30 AM GMT
నేత‌ల మ‌ధ్య పోరు.. రెడ్డి శాంతికి క‌లిసి వ‌స్తోందా?
X
నిజ‌మే! రాజ‌కీయాల్లో దూకుడు మాత్ర‌మే వ‌ర్క‌వుట్ అవ‌దు. ఒక్కొక్క‌సారి.. వివాద ర‌హితంగా ఉండ‌డం.. మౌనంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ప్ల‌స్ అవుతుంది. ఇలాంటి ప‌రిణామ‌మే శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసిన శాంతి.. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయురాలు. పైగా వివాద ర‌హితురాలు. ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. ఎవ‌రితో క‌లుపుకొని పోవాలో.. ఆమెకు బాగా తెలుసు. ఎవ‌రి కూట‌మిలోనూ ఆమె ఉండ‌రు. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుని వివాద ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ప‌రిస్థితులే.. రెడ్డి శాంతికి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నున్నాయ‌ని శ్రీకాకుళం వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రో ఏడాదిలోగానే.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు త‌ప్పుకొంటారు అనే చ‌ర్చ సాగుతోంది. అదేస‌మ‌యంలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని భావిస్తే.. ఈ సారి మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. మేక‌తోటి సుచ‌రిత‌, పుష్ప శ్రీవాణి, తానేటి వ‌నిత‌లు మంత్రులుగా ఉన్నారు. అయితే, వీరంతా కూడా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీకి చెందిన నాయ‌కురాళ్లే. దీంతో ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు ఇద్ద‌రి వ‌ర‌కు ఛాన్స్ దక్కుతుంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో ప‌రిశీలిస్తే.. తొలి పేరు రెడ్డి శాంతిదేన‌ని వైసీపీ సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ పేరు వినిపించినా.. ఎంపీ రంగ‌య్య‌తో ఆమెకు వివాదాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఈ వివాదాలు పెద్ద చిక్కుతెచ్చాయి కొన్నాళ్లుగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డంలేద‌ని టాక్ ఉంది. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె వివాద ర‌హితంగా వ్య‌వ‌హ‌రించ‌డం, పార్టీ ప‌ట్ల అంకిత‌భావంతో ఉండ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి.

జిల్లాలోని మిగిలిన నేత‌ల‌ను చూసుకుంటే.. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించ‌డం.. పార్టీని ఇబ్బందిక‌ర ప‌రిణామాల్లోకి నెట్ట‌డం క‌నిపిస్తోంది. పైగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో కూడా ఉండ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఇక‌, శాంతి విష‌యానికి వ‌స్తే.. ఆమె నియోజ‌క‌వ‌ర్గం త‌ప్ప బ‌య‌ట‌కురావ‌డం లేదు. ఏం చేసినా.. జ‌గ‌న్ పేరుతోనే చేస్తున్నారు. త‌న సొంత డ‌బ్బా ఎక్క‌డా కొట్టుకోవ‌డం లేదు. పైగా సాయిరెడ్డి వంటివారికి ఆమె ఎక్క‌డా వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌స్తోంది. మొత్తానికి మంత్రి వ‌ర్గం కూర్పు మారితే.. రెడ్డి శాంతికి త‌ప్ప‌కుండా ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంటున్నారు.