Begin typing your search above and press return to search.

క్షీరాభిషేకాలు ఎందుకు ఎమ్మెల్యే గారూ !

By:  Tupaki Desk   |   29 April 2022 1:30 PM GMT
క్షీరాభిషేకాలు ఎందుకు ఎమ్మెల్యే గారూ !
X
అతి చేయ‌వ‌ద్దు మీ పుణ్యం ఉంటుందిస‌మ‌స్య‌లు తెలుసుకోండి చాలు దేవుడు కాదు ప్ర‌జ‌లే దీవెన‌లు నేరుగా అందిస్తారు సున్నా వ‌డ్డీ ప‌థ‌కంకు సంబంధించి ల‌బ్ధిదారుల ఖాతాల‌కు నేరుగా డ‌బ్బులు జ‌మ చేశారు సీఎం జ‌గ‌న్. అయితే క్షేత్ర స్థాయిలో వివిధ స‌భ‌లు నిర్వ‌హించి ఈ ప‌థ‌కం ఆవ‌శ్య‌క‌త గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు శ్రీ‌కాకుళం ఎమ్మెల్యేలు.

ముఖ్య‌మంత్రి ఆదేశాలు మేర‌కు ప్ర‌తి మండ‌లంలోనూ స్థానిక డ్వాక్రా గ్రూపుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, ప‌థకం ఆవ‌శ్య‌క‌త‌ను అదేవిధంగా గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన వ‌డ్డీ మాఫీ ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌లో ఉన్న లోపాల‌ను ఇలా అన్నింటినీ వివ‌రిస్తూ ఉన్నారు.

తమ ప్ర‌భుత్వం మ‌గువుల‌కు ఓ పెద్ద‌న్న మాదిరి తోడుగా ఉంటుంద‌ని, ఆర్థికంగా అండ‌గా ఉంటుంద‌ని ప‌దే ప‌దే జ‌గ‌న్ వివ‌రిస్తూ ఉన్నారు. అవే మాట‌ల‌ను, అవే ఉద్దేశాల‌ను పొదుపు సంఘాల‌కు వివ‌రించేందుకు ఎమ్మెల్యేలు చొర‌వ చూపించ‌డం పార్టీ ఇచ్చిన ఆదేశాల మేర‌కు బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డం ఓ విధంగా జ‌గ‌న్ ఇచ్చిన విధి విధానం. బాగుంది.. ఇంత‌వ‌ర‌కూ షెడ్యూల్ బాగుంది కానీ ఈ క్షీరాభిషేకాలు ఎందుకు ? వీటివ‌ల్ల ఏం ప్ర‌యోజ‌నం ? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ఓ ప్ర‌భుత్వం చేయాల్సిన‌వేవో చేయాలి. చేస్తున్న క్ర‌మాన త‌ప్పులు దిద్దుకోవాలి. పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయినా ఆమ‌దాల‌వ‌ల‌స ఎమ్మెల్యే సీతారాం (స్పీక‌ర్ అని రాసే క‌న్నా తాను ముందు ఎమ్మెల్యే అన్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని త‌రుచూ ఆయ‌న చెబుతుంటారు) అయినా నేర్చుకోవాల్సింది ఇదే ! కానీ ఇక్క‌డ అతి పొగ‌డ్త‌ల కార‌ణంగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు వాస్త‌వాలు వివ‌రించ‌డం అన్న‌ది గుర్తుకు రావ‌డం లేదు.

అలానే క్షేత్ర స్థాయిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వే లేదు. నిన్న‌టి వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలు అందరూ ఒక్క‌సారి గ్రౌండ్ లెవ‌ల్ లో త‌మ స్టామినాను పెంచుకునేందుకు ఆరాట‌ప‌డుతున్నారు. ఆ విధంగా జ‌గ‌న్ చెప్పిన విధంగా గ్రాఫ్ పెంచుకునేందుకు ప‌రిత‌పిస్తున్నారు. కానీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు మాత్రం మ‌న‌సు రావ‌డం లేదు.

స్థానికంగా స‌చివాల‌యాలు ఉన్నా భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటే రెవెన్యూ ఉన్న‌తాధికారులే దిక్కు. వాళ్లేమో అదే ప‌నిగా తిప్పుతూ ఉన్నారు. రోడ్ల‌కు సంబంధించి స‌మ‌స్య‌లు వ‌స్తే నిధుల లోటు. క‌నుక ఇవేవీ లేకుండా ఓ సింపుల్ గా ఓ బ‌హిరంగ స‌భ పెట్టి, అటుపై క్షీరాభిషేకాలు చేసి, డ‌మ్మీ చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోవ‌డం ఇప్ప‌టి ఫ్యాష‌న్..అని పెద‌వి విరుస్తోంది టీడీపీ.