Begin typing your search above and press return to search.

నేను ఎవరికీ బయపడలేదు.. నా కుమార్తె కోసమే బయటకు వచ్చాను: పట్టాభి

By:  Tupaki Desk   |   26 Oct 2021 12:53 PM GMT
నేను ఎవరికీ బయపడలేదు.. నా కుమార్తె కోసమే బయటకు వచ్చాను: పట్టాభి
X
సీఎం జగన్‌ను దూషించిన కేసులో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేత పట్టాభి మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తన ఇంటిపై దాడి.. అరెస్ట్.. ఆ తర్వాత జరిగిన ఘటనల గురించి వీడియోలో వివరించారు. తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనలోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. తాను లేనప్పుడు ఇంటిపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న తన కుమార్తెను భయానికి గురిచేశారని, ఇది అంత్యంత అమానవీయమైన చర్య అని ఖండించారు. చిన్నపిల్లలు భయానికి గురయితే ఆ గాయాన్ని రూపుమాపడం ఎంతో కష్టమన్నారు. ఒక బాధ్యత గల తండ్రిగా తన భార్యను, కుమార్తెను కొద్ది రోజుల పాటు బయటకు తీసుకుని వస్తే దానిపై కూడా వైసీపీ నేతలు విపరీత అర్థాలు తీస్తూ కామెంట్స్ చేయడం అత్యంత బాధకరమన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని పట్టాభి తెలిపారు.

రెండున్నరేళ్లుగా అనేక ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని తెలిపారు. ప్రజలకు అనేక అంశాల పట్ల అవగాహన కల్పించానని వివరించారు. తాను లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక కక్షపూరిత దోరణితో తన కుటుంబంపై మూడోసారి దాడి చేశారని తెలిపారు, తిరిగి టీడీపీలో క్రియాశీలకంగా పాల్గొంటానని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని పట్టాభి స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని తప్పుబట్టారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. తర్వలోనే పార్టీలో క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తానన్నారు. తనకు తన కటుంబానికి అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, అలాగే పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంను దూషించిన కేసులో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన పట్టాభి మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. కుటుంబసభ్యులతో ఆయన మాలే విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పట్టాభి ఇంటిపై వైసీపీ దాడి తర్వాత ప్రశాంతత కోసం కొన్నిరోజుల పాటు తన కుటుంబసభ్యులను విహారయాత్రకు పట్టాభి తీసుకెళ్లారు. పట్టాభికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆయనపై హైకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించేదు. అందువల్ల ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు చెబుతున్నారు. పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టు ఈనెల 28కి వాయిదా వేసిందని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తెలిపారు.

హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలైనారు. మరోసారి పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళనతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. హనుమాన్‌జంక్షన్‌ దాటి పొట్టిపాడు టోల్‌ప్లాజాకు అదే రోజు రాత్రి 10.30 ప్రాంతంలో పట్టాభి వెంట వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అయితే సుమారు గంట తర్వాత పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.. అయితే సోమవారం ఆయన మాలే విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్‌పోర్టులో పట్టాభి తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.