Begin typing your search above and press return to search.

రూ.1500 కోట్ల భూమిని రూ.200 కోట్లకు లాగేశారంటూ పట్టాభి సంచలనం

By:  Tupaki Desk   |   7 April 2022 4:23 AM GMT
రూ.1500 కోట్ల భూమిని రూ.200 కోట్లకు లాగేశారంటూ పట్టాభి సంచలనం
X
సంచలన ఆరోపణల్ని సంధించారు టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డిల బినామీ కంపెనీ జీఆర్పీఎల్ కి దోచిపెట్టినట్లుగా ఆయన చెబుతున్నారు. విశాఖలోని మధురవాడలో 97.3 ఎకరాల భూమి విలువ రూ.1500 కోట్లు ఉంటుందని.. కానీ ఆ భూమిని కారుచౌకగా రూ.200 కోట్లకు దోచి పెట్టటాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.

సదరు భూమిని ప్రభుత్వం నిర్ణయించిన రూ.97 కోట్లకు ఎన్ సీసీ సంస్థ 2021 అక్టోబరు 26న చెల్లిస్తే.. సేల్ డీడ్ చేయమని ఆ తర్వాతి రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. అదే రోజు భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారన్నారు. భూమిని ఎన్ సీసీ సంస్థ జీఆర్పీఎల్ కి అమ్మేస్తుందని.. ఇంత మెరుపు వేగంతో చేయాల్సిన అవసరం ఏమిటి? దీన్ని చూస్తేనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ భూమి మీద ఎంతటి ప్రత్యేక ఆసక్తి ఉందో అర్థమవుతుందన్నారు.

రూ.187 కోట్లకు ఎన్ సీసీ కంపెనీ కొనుగోలు చేసి.. పెద్దగా లాభం లేకుండా కేవలం రూ.200కోట్లకు అమ్మేస్తుందా? అని ప్రశ్నిస్తున్న పట్టాభిని ఆ సంస్థకు రూ.187కోట్లకు ఎలా ఇచ్చేశారంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మరిన్ని వివరాల్ని చెప్పుకొచ్చారు పట్టాభి.

ఎన్ సీసీ సంస్థ 2005లో రూ.90 కోట్లు కట్టిందని.. దాని మీద వడ్డీ లెక్కిస్తే ఏ ఐదారు వందల కోట్లో అవుతుందన్నారు. ఇన్నేళ్లు భూమి కోసం ఎదురు చూసిన ఎన్ సీసీ తీరా చేతికి భూమి వచ్చిన తర్వాత కేవలం రూ.200 కోట్లకు ఎలా అమ్మేస్తుంది? ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.6 కోట్లు ఉంటుందని బొత్స సత్యనారాయణ చెబుతున్నారని.. ఆ లెక్కన వేసుకున్న ఆ భూమి విలువ రూ.600 కోట్ల ఉంటుంది కదా? అని ప్రశ్నించారు.

తాను ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగానని చెప్పే బొత్స సత్యానారాయణ మధురవాడలో చదరపు గజం రూ.4వేలే ఉన్నట్లు చెబుతున్నారని.. ఇప్పుడక్కడ రూ.40వేలు ఉందన్నారు. ఎన్ సీసీ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం జీపీఏ ఇచ్చేసిందని బొత్స అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఎన్ సీసీ సంస్థ కోరితే.. సదరు భూమిపై ఎన్ సీసీకి జీపీఏ ఇచ్చేందుకు ఏపీ హెచ్ బీకి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాతే అన్ని జరిగాయని ఆయన చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే.. అన్ని గత ప్రభుత్వంలోనే జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చూస్తుంటే.. ఈ భూ వ్యవహారం ఏపీలో రాజకీయ వేడిని పెంచటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.