Begin typing your search above and press return to search.

బెట్టింగ్ మంత్రి.. బెంజ్ మంత్రి ...బ్లాక్ టికెట్ల మంత్రి!

By:  Tupaki Desk   |   21 Dec 2021 3:29 AM GMT
బెట్టింగ్ మంత్రి.. బెంజ్ మంత్రి ...బ్లాక్ టికెట్ల మంత్రి!
X
ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీడీపీ నేత పట్టాభి. ఆ మధ్యన ఆయన నోటి నుంచి వచ్చిన ‘బోసిడీకే’ మాట ఎంతటి రాజకీయ రచ్చకు కారణమైందన్న సంగతి తెలిసిందే. మర్యాద ఇవ్వటం.. పుచ్చుకోవటం లాంటివి దాదాపుగా మర్చిపోయిన ఏపీ రాజకీయ నేతలు.. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువైంది. ఎంత ఘాటుగా తిడితే.. అంత గొప్పగా మారిన పరిస్థితి. ఇలాంటివేళ.. ఏపీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

ఇప్పటికే ఏపీలో బెట్టింగ్ మంత్రి.. బెంజ్ మంత్రి ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా బ్లాక్ టికెట్ల మంత్రి కూడా వచ్చారన్నారు. సినిమా టికెట్ల వ్యాపారాన్ని గుప్పెట్లో తీసుకొని భవిష్యత్తులో ఏ రీతిలో బ్లాక్ లో టికెట్లు అమ్మాలి? ఆ విధంగా ఎంత దోచుకోవాలి? అన్న తీరులో ఆలోచిస్తున్నారన్నారు. ఈ వ్యాపారానికి అధిపతిగా పేర్ని నానిని సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే మద్యం.. ఇసుక గుప్పెట్లో ఉన్నాయని.. అందుకే బ్లాక్ టికెట్ల వ్యాపారం కూడా చేయాలని పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖను కూడా కేటాయించినట్లుగా పేర్కొన్నారు. మీడియా ముందుకు వచ్చి విషయాల మీద అవగాహన లేకుండా.. తాడేపల్లి స్కిప్టును చదువుతున్నారన్నారు. ఔటర్ రింగు రోడ్డుకు.. బైపాస్ ప్రాజెక్టుకు మధ్య తేడా తెలీదన్న పట్టాభి.. పేర్ని నాని అండ్ కోను ‘నిశాని బ్యాచ్’ గా అభివర్ణించారు.

‘‘బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఉద్దేశంలో ఉన్న మీకు ఇతర విషయాలు ఏవీ ఎక్కడం లేదు’’ అని పేర్కొన్న పేర్ని నాని.. ఔటర్ రింగ్ రోడ్డు గురించి వైసీపీ నేతలు వినిపిస్తున్న వాదనల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి తాను చెబుతానంటూ 189 కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వివరాల్ని చదివి వినిపించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ ప్రాంతంలో ఎంతెంత భూమి అవసరమన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పి.. నివేదికను వివరించారు.

ఈ అంశంపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పడుతూ.. ఆయన చేసిన.. ‘గూగుల్ మ్యాప్ లో గీతలు గీసిన ప్రాజెక్టు కాదంటూ’ బలమైన పంచ్ విసిరారు. సవివరంగా డిజైన్ చేసిన ప్రాజెక్టును పిచ్చి గీతలుగా అభివర్ణించటాన్ని తప్పు పట్టారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డునే కాదు.. అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా డిజైన్ చేశామని.. 98 కిలోమీటర్ల పరిధి ఉండేలా తీర్చిదిద్దామంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.