Begin typing your search above and press return to search.

బెయిల్ మీద విడుదలైన పట్టాభి ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   24 Oct 2021 7:31 AM GMT
బెయిల్ మీద విడుదలైన పట్టాభి ఇప్పుడెక్కడ?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. దీంతో.. రాజమహేంద్రవరంలోని రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన్ను అధికారులు విడుదల చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసుల తీరుతో భయపడిన ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

పోలీసులు క్రియేట్ చేసిన డ్రామాతోనే ఇదంతా జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయటం.. అనంతరం ప్రొసీజర్ ను ఫాలో అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల వేళలో పట్టాభి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. భారీ కాన్వాయ్ తో జైలు నుంచి బయలుదేరి ఆయన హనుమాన్ జంక్షన్ దాటి పొట్టిపాడు టోల్ ప్లాజాకు శనివారం రాత్రి 10.30 గంటలకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ మొహరించిన పోలీసులుపట్టాభి వెంట వస్తున్న వాహనాల్ని నిలిపివేయటంతో వివాదం నెలకొంది. అనంతరం పట్టాభి కారును మాత్రం పోలీసులు తమవెంట తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అనంతరం పట్టాభి కారు డ్రైవర్.. ఆయనవెంట ఉన్న బాడీగార్డుల ఫోన్ పని చేయలేదు. దీంతో.. ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. ఆయన్ను పోలీసులు మరో కేసులో అరెస్టుచేసి ఉంటారన్న ప్రచారం సాగింది. అయితే.. అందుబాటులోకి లేకుండా పోయిన గంట తర్వాత పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లుగా సమాచారం అందింది.

దీంతో.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే..పట్టాభి కాన్వాయ్ లో ఎక్కువ వాహనాలు ఉండటంతో వాటిని మాత్రమే నిలిపివేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పట్టాభి వాహనాన్ని మాత్రమే అనుమతించామని.. ఆయన్ను అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే.. సురక్షిత ప్రదేశంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. మరేం జరుగుతుందో చూడాలి.