Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డిమాండ్‌.. కార్పొరేష‌న్ల కు కొత్త నోటిఫికేష‌న్‌!!

By:  Tupaki Desk   |   17 Feb 2021 1:30 AM GMT
ప‌వ‌న్ డిమాండ్‌..  కార్పొరేష‌న్ల కు కొత్త నోటిఫికేష‌న్‌!!
X
జ‌న‌సేన అధినేత‌..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్థానిక ఎన్నిక‌ల‌పై కొత్త డిమాండ్‌ను తెర‌మీదికి తెచ్చారు. మునిసిపాలి టీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్‌ను కొత్త‌గా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. గ్రామాల్లో జనసేన బలంగా ఉందనేందుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం అని చెప్పిన ప‌వ‌న్‌.. పార్టీ పుంజుకుంటోంద‌ని చెప్ప‌డానికి ఇది నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. జనసేన మద్దతుదారుల గెలుపు.. పార్టీలోను.. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లోనూ మార్పు మొద‌లైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాన‌ని అన్నారు.

ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీపై విరుచుకుప‌డ్డారు ప‌వ‌న్‌.. అధికార పార్టీ ఒత్తిళ్లు... బెదిరింపులు తట్టుకొని త‌మ వారు నిలిచి గెలిచార‌ని పేర్కొన్నారు. తొలి, రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపిం చాల‌ని జ‌న‌సైన్యానికిదిశానిర్దేశం చేశారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌ మొదటి విడతలో 18 శాతానికి పైగా జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు ఓట్లు వస్తే... రెండో విడతలో అది 22 శాతం దాటింద‌ని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకార ణమ‌ని పేర్కొన్న ప‌వ‌న్ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అధికార పార్టీవాళ్ళు భయపడుతున్నా రని.. దుయ్య‌బ‌ట్టారు.

ఇక‌, ఈ క్ర‌మంలోనే స‌రికొత్త డిమాండ్ ను ప‌వ‌న్ తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌స్తుతం తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చిన 75 మునిసిపాలిటీలు, 12 కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల‌కు నూత‌నంగా షెడ్యూల్ ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోరారు. గ‌త ఏడాది ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను కొన‌సాగిస్తూ.. ఎక్క‌డ ఆపారో.. అక్క‌డి నుంచే కొన‌సాగించ‌డం స‌రైంది కాద‌ని కూడా ప‌వ‌న్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

చాలా మంది అభ్య‌ర్థులు బ‌ల‌వంతంగా నామినేష‌న్ల‌ను వెన‌క్కి తీసుకున్నార‌ని.. మ‌రికొంద‌రు.. క‌రోనాతో మృతి చెందార‌ని.. ..ఇప్పుడు ఈ స్థానాల‌న్నీ.. ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉంద‌ని.. సో.. మ‌ళ్లీ కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇస్తేనే న్యాయం జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ డిమాండ్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.