Begin typing your search above and press return to search.

బాబులా మాట్లాడటం మానవా పవన్?

By:  Tupaki Desk   |   26 Oct 2019 9:20 AM GMT
బాబులా మాట్లాడటం మానవా పవన్?
X
విషయం ఏదైనా సమయం.. సందర్భం చాలా అవసరం. ఎంత మనది అనుకున్నా.. టైం కాని టైంలో టచ్ చేస్తే దాని కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువ. కాస్త బుర్ర పెట్టి ఆలోచించే వారెవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కానీ.. జనాల్ని సమీకరిస్తాం.. ప్రభుత్వానికి బుద్ది చెబుతాం.. రానున్న రోజుల్లో అధికారం మనదే లాంటి డైలాగులు తరచూ చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకు అర్థం కాదన్నది ప్రశ్న.

ఏపీలో ఉన్న చంద్రబాబు సరిపోడన్నట్లుగా ఇప్పుడు ఆయన మాదిరే మరొకరు తయారయ్యారు. ఆయనే జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించని పవన్ కల్యాణ్.. ఇటీవల కాలంలో చేస్తున్న ఉపన్యాసాలు చూస్తుంటే.. బాబు గుర్తుకు రాక మానరు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నాలుగు నెలలు కూడా కాని వేళ.. అప్పుడే అద్భుతాలు అన్ని వరుస కట్టుకొని రావాలన్నట్లుగా కోరే తీరు చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.

ఇదే పవన్ కల్యాణ్.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు పెదవి విప్పటానికి.. విమర్శ చేయటానికి ఇష్టపడే వారు కాదు. అదేమంటే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే విమర్శలు చేయటం తప్పు. పాలించే అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత తప్పులు ఎత్తి చూపిద్దాం. అప్పటివరకూ వెయిట్ చేద్దామని చెప్పేవారు. సీఎం కేర్చీలో బాబు కాకుండా జగన్ కూర్చున్న వేళలో మాత్రం.. వారం నుంచే ప్రభుత్వం మీద అదే పనిగా విమర్శలు చేయటం షురూ చేశారు.

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడన్నట్లుగా పవన్ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో ఉన్నప్పుడో.. తమ అంచనాలకు తగ్గట్లు పాలన లేదన్న వేదనలో ఉన్నప్పుడో.. తమ సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆగ్రహంతో ఉన్న వేళలో ప్రజల మధ్యకు వెళితే వచ్చే మైలేజీకి.. అలాంటిదేమీ లేకుండా అదే పనిగా విమర్శలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదేమీ పట్టని పవన్.. చంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అదే పనిగా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.

ఇసుక మాఫియాకు జగన్ సర్కారు దన్నుగా నిలుస్తుందని ఆరోపిస్తున్న పవన్ కల్యాణ్.. దానికి ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించకపోవటాన్ని ఏమనాలి? ఒకవేళ పవన్ చెప్పినట్లే ఇసుక కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితే నిజమనుకుంటే.. వారు రోడ్డెక్కకుండా ఉంటారా? ఒకవైపు బాబు.. మరోవైపు పవన్ అదే పనిగా ప్రభుత్వాన్ని తప్పు పట్టటమే పనిగా పెట్టుకున్నప్పటికీ ప్రజల్లో ఎలాంటి స్పందన లేకపోవటం దేనికి నిదర్శనం. తాను మాట్లాడుతున్నకొద్దీ తన పరపతి అంతకంతకూ తగ్గిపోవటాన్ని పవన్ గుర్తిస్తే మంచిందంటున్నారు. కానీ.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న పవన్ ధోరణి.. బాబుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉందన్న మాట వినిపిస్తోంది