Begin typing your search above and press return to search.

పవనిజం పవర్ ... ?

By:  Tupaki Desk   |   10 Nov 2021 7:36 AM GMT
పవనిజం పవర్ ... ?
X
పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైన రాజకీయాలు చేస్తారని పేరు. ఆయన మాటలే తూటాలుగా పేల్చుతారు. ఆయన చేసే ప్రసంగాలు యువతకు బాగా నచ్చుతాయి. ఆయన విమర్శల ద్వారా నిప్పులే చెరుగుతారు. ప్రత్యర్ధులను ఆయన టార్గెట్ చేసే తీరే భయంకరంగా ఉంటుంది. పవన్ ఒక స్పీచ్ కానీ మీడియా సభ కానీ ఉంటే దాని మీద రోజుల తరబడి ప్రత్యర్ధులు కౌంటర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతలా ప్రభావవంతమైన స్పీచ్ లతో వేడెక్కించే పవన్ ఆ తరువాత మాత్రం సడెన్ గా చప్పబడిపోతారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన గత ఏడేళ్ళుగా చేస్తున్న రాజకీయాలు ఆయన పోకడలను చూసిన వారంతా చెప్పే మాట ఒక్కటే పవన్ సభల్లో చూపించే ఆవేశం ఆచరణలో ఎక్కడా కనిపించదని.

ఆయన టీడీపీ హయాంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానంలో టూర్ చేశారు. నాడు గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత అమరావతి రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని విమర్శలు వచ్చినపుడు అక్కడకు వెళ్ళి పరామర్శించారు. సంచలన ప్రకటనలు చేశారు. తీరా ఆ తరువాత చూస్తే కంటిన్యూటీ లేదన్న కామెంట్స్ పడ్డాయి. ఇపుడు స్టీల్ ప్లాంట్ సమస్యను పవన్ రాజేశారు. ఆయన స్టీల్ ఉద్యమం మొదలైన చాలా కాలానికి వచ్చారన్న విమర్శలు ఉన్నా వస్తూనే ధాటీగానే మాట్లాడారు. తనదైన పంచ్ లతో మెరుపు షాట్లతో అధికార వైసీపీ గుండెల్లో గుబులు పుట్టించారు.

స్టీల్ ప్లాంట్ కేంద్రానిదే అయితేనేమి, మీరేం చేశారు, అఖిల పక్షం వేయండి, ఉద్యమం భుజానికెత్తుకోండి అంటూ వైసీపీకే పవన్ అల్టిమేటం జారీ చేశారు. మొదట నలభై ఎనిమిది గంటలు మాత్రమే డెడ్ లైన్ పెట్టిన పవన్ ఆ తరువాత కార్మిక సంఘాల సూచనలతో దాన్ని ఏకంగా ఏడు రోజులకు పెంచారు. సరే పవన్ డెడ్ లైన్ల మీద వైసీపీ గట్టిగానే మాట్లాడింది. మంత్రులు అంతా ఆయన్ని నిగ్గదీశారు, వారి వైపు నుంచి చేయాల్సిన ఆరోపణలు చేశారు. మొత్తానికి తేల్చేసినది ఏంటి అంటే మేము ససేమిరా కిమ్మనమని. అదే వైసీపీ చెప్పేసింది.

అంటే పవన్ డెడ్ లైన్ తిరిగి వచ్చి ఆయనకే చుట్టుకుంది అన్న మాట. వారం రోజుల్లో ఏదో చెప్పాలని వైసీపీకి డెడ్ లైన్ పెట్టిన పవన్ ఇపుడు పది రోజులు కావస్తున్నా యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పడంలేదు. ఆయన ఏం చెబుతాడో అని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అఖిల పక్షం వేయకపోతే పోవచ్చు. పవన్ అయినా తన మిత్ర పక్షం బీజేపీ వద్దకు కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్ళి ఈ వ్యవహారానికి ఒక లాజికల్ కంక్లూషన్ ఇవ్వాలని వారు గట్టిగానే కోరుతున్నారు. పవనిజం పవర్ ఏంటో కేంద్రానికి చూపించమంటున్నారు. మొత్తానికి పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తానే భుజాన వేసుకుంటారా లేక గతంలో మాదిరిగా అలా వదిలేసి సైలెంట్ అయిపోతారా అన్న చర్చ అయితే ఉంది. మరి పవన్ ఆలోచనలు ఏంటో చూడాలి. ప్రస్తుతానికైతే కార్మిక లోకం మాత్రం ఆశగా ఎదురుచూస్తోంది. తమకు రాజకీయాలు ఏవీ లేవని ఎవరు వచ్చి తమ సమస్యను నెత్తికెత్తుకున్నా వెల్ కమ్ అంటోంది. మరి పవన్ ఈ సమయాన కనుక వచ్చి స్టీల్ ప్లాంట్ మీద కేంద్రాన్ని నిలదీస్తే ఆయన ఒకే ఒక్కడుగా నిలిచి పోతాడు. మరి పవన్ అలా చేస్తారా. వెయిట్ అండ్ సీ.