Begin typing your search above and press return to search.

సేనాని స్లోగ‌న్ పై పేలుతున్న సెటైర్లు!

By:  Tupaki Desk   |   21 Jun 2022 12:30 PM GMT
సేనాని స్లోగ‌న్ పై పేలుతున్న సెటైర్లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు పెంచారు. ఇప్ప‌టికే జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు, ప్ర‌కాశం, అనంత‌పురం జిల్లాల్లో పంట‌లు పండ‌క‌, గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌క ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున త‌న సొంత నిధుల‌ను అంద‌జేశారు. ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు 600 మందికి ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఇచ్చారు.

కాగా తాజాగా ఇటీవ‌ల బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరులో జ‌రిగిన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు అడిగిన‌వారికి.. అడిగిన‌ట్టు ముఖ్య‌మంత్రిగా చాన్సు ఇచ్చార‌ని.. త‌న‌కు కూడా అవ‌కాశ‌మివ్వాల‌ని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. జ‌న‌సేన పార్టీకి ఒక్క‌సారి అధికారం ఇస్తే ష‌ణ్మ‌ఖ వ్యూహంతో రాష్ట్రాన్ని ప‌రిపాలిస్తాన‌ని చెబుతున్నారు.

త‌న‌కు కూడా ఒక్క‌సారి చాన్సు ఇవ్వాల‌ని కోరుతూ సోష‌ల్ మీడియాలోనూ దాన్ని పోస్టు చేశారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్. దీన్ని ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన పార్టీ ముఖ్య నేత నాగ బాబు కూడా త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మంచి భ‌విష్య‌త్తు కావాలంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి లీడ‌ర్ ను ఎన్నుకోవాల‌ని సూచించారు. అయితే దీనిపై వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి సెటైర్లు పేలుతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క చాన్సు నినాదంపై వైఎస్సార్సీపీ వాళ్లంతా నాగ‌బాబును ట్రోల్ చేస్తున్నారు. ముందు అస‌లు జ‌న‌సేన ఏ పార్టీతో ఉందో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన.. బీజేపీతో ఉందో, టీడీపీతో ఉందో.. అస‌లు ఏ పార్టీతో పొత్తు ఉందో.. ఏ పార్టీతో లేదో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు.

అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందు స‌రిగా త‌న అభిప్రాయాలు ఖ‌రాఖండీగా చెప్పాల‌ని అంటున్నారు. ఒక‌సారేమో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాన‌ని అంటార‌ని, మ‌రోసారి టీడీపీతో క‌ల‌సి వెళ్లాల‌ని ఉంది అని పేర్కొంటార‌ని ఎద్దేవా చేస్తున్నారు. ఇంకోసారేమో అస్స‌లు నాకు ఎవ‌రితోనూ పొత్తులు లేవ‌ని ప‌వ‌న్ చెబుతార‌ని ట్రోల్ చేస్తున్నారు. ముందు ప‌వ‌న్ వైఖ‌రి ఏమిటో ఖ‌రాఖండీగా స్ప‌ష్టం చేయాల‌ని పేర్కొంటున్నారు.

కాగా ఈ ఒక్క చాన్సు నినాదం గ‌తంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కూడా ఇచ్చారు. ఒక్క చాన్సు ఇస్తే రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ గ‌త ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ ఊరూవాడా వెలుగెత్తిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే నినాదాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఎత్తుకున్నార‌ని చెబుతున్నారు. అయితే పాల‌కుడిగా ప‌వ‌న్ కు ఎలాంటి అనుభ‌వం లేద‌ని.. అత‌డిని సీఎంను చేస్తే ఎలా ప‌రిపాలించ‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ముందు ప‌వ‌న్ పార్టీని బలోపేతం చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. పార్టీలో నాయ‌కులు ఎవ‌రు? ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు ఎవ‌రు? పార్టీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత నెంబ‌ర్ టూ నాయ‌కుడు ఎవ‌రు అనే అంశాల‌పై దృష్టి పెట్టాలంటున్నారు. ఆ త‌ర్వాతే ఒక్క చాన్సు అంటే బాగుంటుంద‌ని ఎద్దేవా చేస్తున్నారు.

దీనికి జ‌న‌సైనికుల నుంచి కూడా అంతేస్థాయిలో దీటుగా స‌మాధానాలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ కు కూడా సీఎం కాకముందు ఎలాంటి అనుభ‌వం లేద‌ని, ఎన్టీఆర్ కు అయినా, చంద్ర‌బాబుకు అయినా వారు సీఎంలు అయ్యేముందు ఎలాంటి అనుభ‌వం లేద‌ని ఉద‌హ‌రిస్తున్నారు. వాళ్ల‌కు అనుభ‌వం లేక‌పోయినా ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని.. అలాంటిది ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.