Begin typing your search above and press return to search.

ఆరు నూరు అయినా : ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే...?

By:  Tupaki Desk   |   20 Jun 2022 4:30 PM GMT
ఆరు నూరు అయినా :  ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే...?
X
మొత్తానికి పవన్ ఒక క్లారిటీకి వచ్చేశారు. ముసుగులో గుద్దులాటకు తావులేకుండా స్పష్టంగా చెప్పాల్సింది చెప్పేశారు. అది కూడా ఏ నాలుగు గోడల మధ్యనో కాదు, పార్టీ వారితో కూడా కాదు, వేలాదిగా తరలివచ్చిన జనసందోహంలోనే పవన్ గట్టిగా చెప్పారు. అవును నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను. నాకే ఓటేయండి. నేను రాజకీయాల్లో చాలా ఏళ్ళుగా ఉన్నాను. రాష్ట్రం కోసం ప్రతీ సారీ తపన పడుతున్నాను. అందుకే నాకే మీ ఓటు వేయాలి. నాకే చాన్స్ ఇవ్వాలి ఇదీ పవన్ చేసుకున్న విన్నపం.

పర్చూరు మీటింగ్ కనుక పరిశీలిస్తే పవన్ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే కనిపించారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి సంబంధిచిన కీలకమైన అంశంగానూ చూడడంతోనే అలా ప్రకటించాల్సి వచ్చింది అంటున్నారు. ఇంతకాలం వైసీపీ అన్న మాటలే ఇపుడు పవన్ నోట వచ్చాయని చెబుతున్నారు. ఒక రకంగా పవన్ని వైసీపీ ప్రభావితం చేసిందా అన్న చర్చ కూడా ఉంది.

పవన్ ఎవరి పల్లకీనో మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప తాను సీఎం కావాలని ఆయనకు లేదు అని వైసీపీ నేతలు తరచూ అంటూ ఉంటారు. పవన్ అయితే ఇపుడు ఆ మాటలు తప్పు అని చెప్పేలా తానే సీఎం అని గట్టిగా ప్రకటించుకున్నారు అని తెలుస్తోంది. అదే సమయంలో ఇక పొత్తు మాట ఎత్తితే ఒట్టు అని పర్చూర్ మీటింగ్ సాక్షిగా చెప్పేశారు. తనకు జనంతోనే పొత్తు అని చెప్పడం వెనక ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు.

బంతిని తీసుకెళ్ళి టీడీపీ కోర్టులోకి నెట్టేశారు. తాను సీఎం కావాలని కోరుకుంటున్నానని, అది సమ్మతం అయితేనే టీడీపీ వారే పొత్తుల ప్రస్థావనను ఇక మీదట చేయవచ్చు అని కూడా సందేశం ఇచ్చారు. అంటే సీఎం అభ్యర్ధిగా తనను ప్రతిపాదించి అధికారంలో వాటా ఇస్తే తప్ప టీడీపీ వైపు తొంగి చూడను అని పవన్ అంటున్నారు అని అర్ధమవుతోంది.

అదే టైమ్ లో విడిగా పోటీకి కూడా పవన్ తాను మానసికంగా సమాయత్తమైపోయారు. అలాగే క్యాడర్ ని కూడా రెడీ చేస్తున్నారు. ఇక జనాలకు కూడా కొత్త రాజకీయం కొత్త నాయకత్వం కొత్త అభ్యర్ధి ముఖ్యమంత్రి అంటూ చెప్పడం వెనక తానే సింహాసనం అధిష్టించాలన్న కోరికను చెప్పడమే అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ రకంగా చెప్పడంతో ఏపీలో మూడు పార్టీల మధ్యన సాగే పొత్తులాటకు ఇపుడు సడెన్ గా బ్రేక్ పడినట్లే. దాంతో ఎవరి దారి వారిదే అన్నట్లుగానే పొలిటికల్ సీన్ ఉంది అంటున్నారు. టీడీపీ అయితే పవన్ మూడు ఆప్షన్ల మీద నోరెత్తడంలేదు. బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్ధి మీద మాట్లాడలేదు. బహుశా ఇవన్నీ మనసులో ఉంచుకునే పవన్ జనంతోనే పొత్తు అనేశారు.

టోటల్ గా చూస్తే ఒక విషయం లో క్లారిటీ ఉంది. అదేంటి అంటే ఆరు నూరు అయినా పవన్ సీఎం కావాలి. ఇది ఆయనతోపాటు ఆ సామాజికవర్గం కోరిక. అంతే కాదు పవన్ని ముందు పెట్టి ఆల్టరేషన్ పాలిటిక్స్ కి తెర తీయాలని చూస్తున్న వారి కోరిక. ఇన్నాళ్ళకు పవన్ దానికి ఓకే చెప్పాడు. సో ఆయన ఈ పొత్తుల కధలో వెనక్కి వెళ్ళే చాన్స్ అయితే లేదు. ఒక వేళ ఆయన కనుక తగ్గితే సొంత పార్టీలోనూ సొంత సామాజికవర్గంలోనూ కూడా చులకన అవడం ఖాయం. సో పవన్ వైపు క్లారిటీ వచ్చేసినట్లే.