Begin typing your search above and press return to search.

పవన్...సీఎం సీటూ... ?

By:  Tupaki Desk   |   12 Dec 2021 2:30 AM GMT
పవన్...సీఎం సీటూ... ?
X
పవన్ కళ్యాణ్ బేసికల్ గా సినీ నటుడు. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నా కూడా పూర్తి స్థాయి పొలిటీషియన్ గా ఆలోచించరు అన్నది ఒక విమర్శ. అదే ప్రశంస కూడా. పవన్ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు మాట్లాడుతారు, ఆయనలో ఆవేశం పాలు ఎక్కువ అని కూడా విశ్లేషిస్తారు. పవన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చింది 2009 ఎన్నికల నుంచి. అంటే దాదాపుగా పుష్కర కాలం అనుభవం అన్న మాట.

ఇక రాజకీయం అంటే శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే మిత్రులు కూడా ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సూత్రాన్ని అసలు ఫాలో కావడం లేదు. ఆయన సగటు మనిషిగానే ఆలోచిస్తారు కాబట్టి అలాగే రాజకీయం చేస్తున్నారు. అందుకే ఆయనకు శాశ్వత శత్రువుగా జగన్ ఉంటున్నారు. ఇక ఆయన వేస్తున్న అడుగులు సీఎం సీటు వైపు గానే ఉన్నాయి. కానీ అవి ఆయన ఆ కుర్చీ ఎక్కేందుకు కాదు, అందులో ఉన్న జగన్ని దించేటందుకు.

రాజకీయాల్లో ఒకరిని దించడం ఎంత ముఖ్యమో వేరొకరు కూర్చోకుండా ఠక్కున ఆ కుర్చీలో తామే ఎక్కేయడం అంతే ముఖ్యం. అయితే పవన్ కి దించేయడం మీద ఉన్న దృష్టి తాను సీఎం సీటు ఎక్కాలన్న దాని మీద లేదు అన్నదే ఆయన గురించి ఆలోచిస్తున్న వారి చర్చ. పవన్ కి జగన్ అంటే రాజకీయంగా పడదు, అది ఆయన ఏనాడూ దాచుకోలేదు, బాహాటంగానే చెప్పేస్తూ వచ్చారు. 2014లో జగన్ కాకుండా కూటమి ఏర్పాటుకు సహకరించిన పవన్ 2019 ఎన్నికల వేళ జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తాను అంటూ సవాల్ చేసి మరీ సొంతంగా పోటీ చేశారు.

అయితే జగన్ కి నాడు ఉన్న వేవ్ కారణంగా పవన్ సవాల్ అలాగే ఉండిపోయింది. అయితే ఈసారి పవన్ శపధం నెరవేరేందుకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉండే చాన్స్ ఉంది. ఎందుకంటే జగన్ని సీఎం గా చూడాలని తపించిన వర్గాలు ఇపుడు పూర్తిగా శాంతించాయి. జగన్ పాలన చూసిన వారు కూడా 2024 ఎన్నికల్లో ఆయన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఓటు వేస్తారు.

మరో వైపు అయిదేళ్ల పాటు పాలించిన ప్రభుత్వానికి యాంటీ ఇంకెంబెన్సీ తప్పకుండా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈసారి పవన్ ఎక్కుపెట్టే బాణాలు అన్నీ కూడా వైసీపీకి సూటిగానే తగిలే అవకాశాలు ఉన్నాయి. నాడు చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు జగన్ని విమర్శించి మిస్ ఫైర్ చేసుకున్న పవన్ ఈసారి కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నారు. అధికార పార్టీగా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.

పవన్ ప్రయత్నాలు ఫలించి జగన్ గద్దె దిగడం ఖాయమైతే జనసేనానికి లభించేది ఏంటి అంటే ఆత్మ సంతృప్తి మాత్రమే. అదెలా అంటే జగన్ని గద్దె దింపగలిగానూ అని. కానీ అదే టైమ్ లో తాను ఆ సీటు ఎక్కకపోతే మాత్రం అటు అభిమానులతో పాటు 2024 నాటికి పదేళ్ళుగా జనసేన తరఫున పోరాడే వారందరికీ తీరని నిరాశే మిగులుతుంది. ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి. పవన్ ఒక వైపే చూస్తున్నారు. కానీ రెండవ వైపు కూడా చూడాలి. జగన్ని దింపడం ఎంత ముఖ్యమో పవన్ గద్దెనెక్కడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగా తన రాజకీయ వ్యూహాలను పవన్ సెట్ చేసుకుంటేనే జనసైనికుల కళ్లలో ఆనందాన్ని ఆయన చూడగలుగుతారు.