Begin typing your search above and press return to search.

గంటా.. ఎగిరిపోయే ప‌క్షి: ప‌వ‌న్

By:  Tupaki Desk   |   26 Jan 2019 5:01 AM GMT
గంటా.. ఎగిరిపోయే ప‌క్షి: ప‌వ‌న్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి - ఒక‌ప్ప‌టి ప్ర‌జారాజ్యం నేత గంటా శ్రీ‌నివాస‌రావు త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేర‌బోతున్నారంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న అన్న చిరంజీవికి స‌న్నిహితుడైన గంటాను చేర్చుకునేందుకు ప‌వ‌న్ అంగీక‌రించార‌ని.. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ ప్ర‌చార‌మంతా వ‌ట్టిదేన‌ని తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ తేల్చేశారు. త‌మ పార్టీలో గంటాను చేర్చుకునే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా గంటాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు - విమ‌ర్శ‌లు చేశారు.

విశాఖ‌ప‌ట్నంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌న‌సేన‌లో గంటా చేరిక అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో గంటాను ప‌వ‌న్ పార్టీలోకి ఆహ్వానించ‌బోతున్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై నేరుగా త‌మ అధినేత వ‌ద్ద‌ జ‌న‌సేన నేత‌లు ఆరా తీశారు. వారిలో ప‌లువురు గంటా స‌న్నిహితులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే - గంటా పేరెత్తిన వెంట‌నే ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డార‌ట‌. ఆయ‌న్ను పార్టీలో చేర్చుకోబోన‌ని ప్ర‌క‌టించార‌ట‌. గంటాతో వెన్నుపోటు పొడిపించుకొనేటంత బ‌ల‌హీనుడిని తాను కాద‌ని ప‌వ‌న్ పేర్కొన్న‌ట్లు తెలిసింది.

జ‌న‌సేన అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. గంటాపై త‌న‌కు వ్య‌క్తిగ‌త కోప‌మేదీ లేద‌ని ప‌వ‌న్ వైజాగ్ నేత‌ల‌తో చెప్పారు. అయితే ఆయ‌న మైండ్ సెట్ జ‌న‌సేన మైండ్ సెట్ కు సెట్ కాద‌ని ప‌వ‌న్ అన్నారు. గంటాను ప‌క్షితో పోల్చారు. ఆయ‌న‌లాంటి వ్య‌క్తులు ప‌క్షుల్లా వ‌చ్చి ఎగిరిపోతుంటార‌ని పేర్కొన్నారు. ప‌ద‌వుల కోసం అర్రులు చాచే అలాంటి వ్య‌క్తుల‌ను తాను న‌మ్మ‌బోన‌ని చెప్పారు.

గంటాను వెన్నుపోటుదారుడిగా అభివ‌ర్ణిస్తూ ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ప్ర‌జారాజ్యం పార్టీకి, చిరంజీవికి గంటా వెన్నుపోటు పొడిచిన సంగ‌తి ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చిరంజీవికి గంటా స‌న్నిహితుడు. 2009లో ఆయ‌న‌ ప్ర‌జారాజ్యంలో చేరారు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి నుండి శాస‌న‌స‌భ‌కు ఎన్నికయ్యా రు. ఆ త‌రువాత చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్ప‌ట్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో గంటాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో గంటా టీడీపీలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌సేన‌లో చేరేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొంత‌కాలంగా వార్త‌లొస్తున్నాయి.