Begin typing your search above and press return to search.

విశాఖలో అక్కడ నుంచి పవన్ పోటీ....?

By:  Tupaki Desk   |   7 Jan 2023 12:30 AM GMT
విశాఖలో అక్కడ నుంచి పవన్ పోటీ....?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అలా సాగుతూనే ఉంది. ఆయన గత ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా కూడా ఆయన ఓటమి పాలు అయ్యారు. అయితే ఈసారి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దాని మీద జనసైనికులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిపించుకుని తీరుతామని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి గాజువాక నుంచి పోటీ చేస్తే తప్పనిసరిగా గెలిపిస్తామని అంటున్నారు. జనసేన గ్రాఫ్ బాగా అక్కడ పెరిగింది అని చెబుతున్నారు. గాజువాకలో జనసేనకు 30 శాతం ఓట్ల షేర్ గత ఎన్నికల్లో లభించింది. పవన్ కళ్యాణ్ కి 56 వేల 125 ఓట్లు వచ్చాయి.

అక్కడ వైసీపీకి 38 శాతం ఓట్ల షేర్ గతంలో లభిస్తే 74 వేల ఓట్లకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి దక్కింది. ఇక తెలుగుదేశానికి కూడా బాగానే బలం ఉంది. 26 శాతం ఓట్ల షేర్ తో పాటు 54 వేల ఓట్ల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇపుడు చూస్తే వైసీపీలో గతంలో ఉన్న ఊపు లేకపోవడం, టికెట్ల రేసులో పలువురు దిగడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వరు అన్న ప్రచారం నేపధ్యంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఇక జనసేన తరఫున ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తప్పకుండా గెలిపించుకుంటామని సైనికులు శపధం చేస్తున్నారు. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మకశక్తిగా జనసేన ఈసారి ఉంటుందని అందువల్ల ఆ పార్టీ అధినాయకుడే గాజువాక వస్తే గెలుపు మాత్రమే కాదు భారీ మెజారిటీ డ్యాం ష్యూర్ అని అంటున్నారు.

గాజువాక నిండా మెగాభిమానులు దండిగా ఉన్నారు. అలాగే బలమైన కాపు సామాజికవర్గం ఇక్కడ ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా సరైన పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడంతో ఓటమి సంభవించిందని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగనీయమని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ సైతం గాజువాక సీటు మీద ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు.

గత ఏడాది అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా టూర్ చేసినపుడు పెద్ద ఎత్తున అభిమాన జన సందోహం తో విశాఖ అంతా నిండిపోయింది. పవన్ మానియా ఏంటో విశాఖ సహా ఏపీ అంతా నాడు చూసింది. ఆ ఘటన తరువాత పవన్ ఇమేజ్ మరింతగా పెరిగింది అని అంటున్నారు. దాంతో పాటు విశాఖ కేంద్రంగా పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఉత్తరాంధ్రాలో కూడా ఆ ప్రభావం గణనీయంగా ఉంటుందని, తద్వారా జనసేన విజయావకాశాలు కూడా మెరుగుపడతాయని అంటున్నారు.

పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తే మాత్రం విశాఖ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. విశాఖలో వైసీపీకి బలం తక్కువ అని విపక్షాలు భావిస్తూంటాయి. పైగా రాజధానిగా విశాఖను చేస్తామని వైసీపీ చెప్పుకుంటున్న వేళ ఇక్కడ నుంచి పవన్ పోటీ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయట. ఇక పవన్ కనుక గాజువాక బరి నుంచి పోటీకి దిగితే ఆయనను ఢీ కొట్టడానికి ఒక సినీ ఫిగర్ ని పోటీలో నిలబెడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఆ బిగ్ ఫిగర్ ఎవరో మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.