Begin typing your search above and press return to search.

వారాహి పేరుతో ప్రత్యర్థులను భారీగా వాయించేసిన పవన్

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:30 AM GMT
వారాహి పేరుతో ప్రత్యర్థులను భారీగా వాయించేసిన పవన్
X
మాటకు మాట అంటే తప్పించి అర్థం కాని పాడు రోజులు తెలుగు రాజకీయాల్లోకి వచ్చేయటం తెలిసిందే. మర్యాదగా మాట్లాడటం.. విలువల్ని పాటించటం లాంటివి వదిలేసి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. మర్యాద.. సంస్కారం లేనట్లుగా మాట్లాడేయటం.. బూతులు తిట్టేయటం లాంటివి ఎక్కువ అయిపోతున్న ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కాస్తంత భిన్నమని చెస్పాలి.

నోటికి వచ్చినట్లుగా తన మీద మాట్లాడే రాజకీయ ప్రత్యర్థులకు అదే స్థాయిలో సమాధానం ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. అలాంటి మాటలు మాట్లాడటం తనకు ఇష్టం ఉండదన్న విషయాన్ని ఓపెన్ గా చెబుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలన్న విషయాన్ని తన మాటలతో చూపించటం చేస్తున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తనకున్న అవగాహనను అర్థమయ్యేలా చెబుతున్న పవన్.. తనను అనవసరంగా కెలికే వారికి.. వాళ్లకు అర్థమయ్యే బాషలో బదులివ్వటం కాస్త విశేషంగా చెప్పాలి. ఇలా రెండు రకాలుగా రియాక్టు అయ్యే విలక్షణ నేతగా పవన్ ను చెప్పాలి. తన పర్యటన కోసం సిద్ధం చేసిన వారాహి వాహనం మీద ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రంగా రియాక్టు కావటం.. దానిపై చేసిన విమర్శలపై తాజాగా కౌంటర్ ఇచ్చారు పవన్.

తన భారీ వాహనానికి వారాహి అంటూ అమ్మవారు పేరు పెట్టుకున్న పవన్.. తనను తప్పు పడుతున్న వారికి ఘాటుగా రియాక్టు కావటమే కాదు ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల్ని గాడిదలుగా అభివర్ణించిన ఆయన.. "రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారు.. ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి" అని మండిపడ్డారు.

"వారాహి రంగేమిటి? టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడతారు.వారాహి వాహనంతో ఏపీలో పర్యటిస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. అడ్డుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తా" అంటూ తేల్చేశారు. వారాహితో ఇప్పటికే జరిగిన రాజకీయ హీట్ కు పవన్ తాజా వ్యాఖ్యలు మరింత పెంచేలా ఉన్నాయని చెప్పాలి. మరి.. రానున్న రోజుల్లో వారాహితో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.