Begin typing your search above and press return to search.

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ : పవన్

By:  Tupaki Desk   |   4 July 2022 6:58 AM GMT
విజయవాడలో  బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ : పవన్
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రూట్ మార్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఇందులో నాలుగు వంద‌ల‌కు పైగా అర్జీలు అందుకున్నారు. బాధితుల గోడు ప్ర‌శాంతంగా విన్నారు.

వారి అర్జీలు చ‌దివి, వీలున్నంత మేర‌కు న్యాయం చేసేందుకు మ‌రియు చేయించేందుకే ప్ర‌య‌త్నిస్తాన‌ని భరోసా ఇచ్చిపంపారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతుంద‌ని విరుచుకు ప‌డ్డారు.

విజ‌య‌వాడ ఎంబీకే భ‌వ‌న్ లో నిన్న‌టి వేళ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి, బాధితుల మొర ఆల‌కించి, అర్జీలు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాడేప‌ల్లి సీఎం నివాసంకు ఆనుకుని భ‌ద్ర‌త పేరుతో అక్ర‌మంగా త‌మ ఇంటిని కూల్చేశార‌ని పేర్కొంటూ శివ‌శ్రీ అనే బాధితురాలు ప‌వ‌న్ ఎదుట క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు.

అదేవిధంగా త‌న అన్న‌య్య అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు అని ఆమె ప‌వ‌న్ కు వివ‌రించి త‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. జ‌న‌వాణి కార్య‌క్ర‌మంలో భాగంగా తాను గుర్తించిన మొద‌టి స‌మ‌స్య‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిగ‌ణించి, ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని అన్నారు.శివశ్రీ అన్న‌య్య అనిల్ కుమార్ ఏ విధంగా చ‌నిపోయారు అన్న‌ది తెలుసుకునేందుకు అదేవిధంగా బాధిత కుటుంబానికి అండ‌గా నిలిచేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు.

ఇప్ప‌టికే త‌న‌ను ఓ సారి బాధితురాలు క‌లిసినందున ఆమె కుటుంబంపై అక్ర‌మ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నార‌న్నారు. శివ‌శ్రీ అన్నయ్య అనుమానాస్ప‌ద మృతికి సంబంధించి కూడా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాల్సి ఉన్నా ఇంత‌వ‌ర‌కూ పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌లేద‌న్నారు. మరోవైపు జ‌న‌సేనానికి క‌లిసేందుకు తండోప‌తండాలుగా జ‌నం క‌ద‌లివచ్చారు. దీంతో వ‌చ్చే ఆదివారం కూడా ఇదే ప్రాంగ‌ణాన ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తామ‌ని మాజీ స్పీక‌ర్ నాదేండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

అదేవిధంగా వీలున్నంత వ‌ర‌కూ స‌మ‌స్య ప‌రిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామ‌ని, ప్ర‌భుత్వాన్ని మేలుకొలిపే విధంగా ప‌నిచేస్తామ‌ని ఆయన చెప్పారు. ఇక ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో విజ‌య‌వాడ కేంద్రంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎక్కువ‌యిపోతున్నాయ‌ని, సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం కావాలి అని కోరుకున్న వారు ఆ ప‌ని చేయ‌కుండా బ్రాందీ షాపుల‌పై వ‌చ్చే ఆదాయంపైనే ఆధార‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.