Begin typing your search above and press return to search.

పొత్తులపై ఈ మాటలు అవసరమా పవనా?

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:43 AM GMT
పొత్తులపై ఈ మాటలు అవసరమా పవనా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏం కావాలి? తానుఏం కావాలన్న దానిపై ఆయనకు క్లారిటీ ఉందా? వ్యూహంలో భాగంగా ఆయన మాటలు ఉన్నాయి. అటూ ఇటూ తేల్చుకోలేని మీమాంసలో ఆయన మాట్లాడుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడంటే ఏపీలో రాజకీయం వేడెక్కింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్న వేళలో.. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి మాట్లాడి కొత్త చర్చను తెర మీదకు తెచ్చిన పవన్.. ఆ తర్వాతి కాలంలో చేసిన వ్యాఖ్యలు.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అనవసరమైన రచ్చకు కారణమవుతున్నాయని చెప్పాలి.

ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు తనకున్న రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం ఆ విషయంలో తడబాటుకు గురి అవుతున్నట్లుగా కనిపించక మానదు. సున్నితమైన అంశంపై తాను కానీ తన వారు కానీ స్పందించే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా.. ఈ అంశం మీద ఎవరికి వారు వ్యాఖ్యలు చేయటం.. వీటికి కొనసాగింపుగా సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలన్న వ్యాఖ్య ఉభయులకు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి.

నిజానికి కొన్ని అంశాల్లో క్లారిటీ చాలా ముఖ్యం. పొత్తు అంశంలో ప్రాధాన్యత.. తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన జగన్ ను అధికారం నుంచి దించేయటం మాత్రమే సింగిల్ పాయింట్ ఎజెండా ఉండాలే తప్పించి.. ఈ విషయంలో ఇతర విషయాల్ని తీసుకురాకూడదు. ఆలూ లేదు చూలు లేదు మొగుడుపేరు సోమలింగం అన్న చందంగా పొత్తు విషయం మీదనే ఒక నిర్ణయానికి రాని వేళ.. ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇప్పుడు చర్చ అవసరమా? అన్నది ప్రశ్న.

సాధారణంగా ఒక కీలక లక్ష్యాన్ని సాధించటమే పనిగా పెట్టుకున్న వేళలో చూపు మొత్తం దాని మీదనే ఉండాలే తప్పించి.. ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే ప్రయోజనాలు ఏంటి? వాటితో ఎవరు ఏమేం కావొచ్చన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. అదే జరిగితే.. అసలు లక్ష్యం పక్కకు వెళ్లి.. అవసరం లేని అంశాలు వచ్చి చేరతాయి. పవన్ విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా బాపట్ల జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. పొత్తుపై మరోసారి మాట్లాడారు.

ప్రస్తుతానికి ప్రజలతోనే తనకు పొత్తు ఉందని.. భవిష్యత్తు పరిణామాల్ని అనుసరించి ఆలోచిస్తానని ఆయన వ్యాఖ్యలు చేశాయి. గతంలో పవన్ నోటినుంచి ఒక మాట స్పష్టంగా.. కచ్ఛితంగా వినిపించేది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించటమే తన ప్రధాన ఎజెండా అన్నట్లు ఉండేది. తాజాగా ఆయన మాటల్లో మార్పు కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. పొత్తుపై కీలక ప్రకటన చేసిన తర్వాత.. పవన్ తో పాటు.. ఆయన వర్గీయులు ఆ అంశం మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.

పవన్ ప్రకటన తర్వాత వైసీపీ నేతల గేమ్ ప్లాన్ చూస్తే.. పొత్తును ఎలా బ్రేక్ చేయాలన్న దానిపై వారు ప్రధానంగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయటం ద్వారా.. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వీలుంది. అందుకు భిన్నంగా తడవకో మాట మాట్లాడటం ద్వారా అనవసరమైన కన్ఫ్యూజన్ పెంచటమే అవుతుందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది.